అమ్మకాల్లో దూసుకుపోతున్న 'చిన్నకారు'
న్యూఢిల్లీ: మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు పోటీగా జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టిన చిన్న కారు 'రెడి-గో' అమ్మకాల్లో దూసుకుపోతోంది. 23 రోజుల్లోనే 3 వేల కార్లు అమ్ముడయ్యాయి. జూన్ 7 నుంచి ప్రారంభమైన 'రెడి-గో' అమ్మకాలకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర తెలిపారు. 23 రోజుల్లో 3 వేల కార్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. వినియోగదారులకు పెద్ద సంఖ్యలో కార్లు డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 274 సేల్స్ అండ్ సర్వీసెస్ అవుట్లెట్స్ ద్వారా 'రెడి-గో' అమ్మకాలు సాగిస్తున్నామన్నారు.
'రెడి-గో' పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్‌లో నిర్ణయించారు. డాట్సన్ ఈ కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నారు. డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని నిస్సాన్ కంపెనీ తెలిపింది.