Datsun
-
భారత్ నుంచి మళ్లీ డాట్సన్ ‘గో’..
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ .. భారత్‌లో తమ డాట్సన్ బ్రాండ్ కార్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ‘చెన్నై ప్లాంటులో (రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా) డాట్సన్ రెడీ–గో ఉత్పత్తి నిలిపివేశాం. అయితే, స్టాక్ ఉన్నంత వరకూ వాటి విక్రయాలు కొనసాగుతాయి. డాట్సన్ కొనుగోలు చేసిన ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్లకు యథాప్రకారంగా దేశవ్యాప్త డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, విడిభాగాలు అందుబాటులో ఉంచడం, వారంటీపరమైన సపోర్ట్ అందించడం కొనసాగిస్తాం‘ అని నిస్సాన్ ఇండియా తెలిపింది. కంపెనీ ఇప్పటికే డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవెల్ చిన్న కారు గో, కాంపాక్ట్ మల్టీపర్పస్ వాహనం గో ప్లస్ మోడల్స్ ఉత్పత్తి ఆపేసింది. డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదు. 1986లో ఆపేసే నాటికి డాట్సన్ భారత్ సహా 190 దేశాల్లో అమ్ముడయ్యేది. మళ్లీ చాలాకాలం తర్వాత 2013లో డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. మిగతా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో 2020లోనే రష్యా, ఇండోనేసియా మార్కెట్లలో డాట్సన్‌ను ఆపేసిన నిస్సాన్ అటు పై క్రమంగా భారత్, దక్షిణాఫ్రికాలో కూడా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. -
పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్ కార్లపై భారీగా డిస్కౌంట్
ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలకే డాట్సన్ కారును కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్తగా డాట్సన్ కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం 'డాట్సన్' దేశంలో విక్రయించే కార్ల(రెడి-గో, గో, గో ప్లస్)పై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించింది. అత్యధికంగా రూ.40 వేల వరకూ రాయితీలు అందిస్తుంది. ఈ స్టాక్ కొనసాగే వరకు లేదా అక్టోబర్ 31, 2021 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డీలర్ షిప్ స్థాయి బట్టి ఆఫర్లో మార్పులు ఉంటాయి. (చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!) ఎన్ఐసీ అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఎక్స్ఛేంజీ బోనస్ లభిస్తుంది. అధికారిక వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. డాట్సన్ రెడీ-గోపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనిలో ₹20,000 నగదు ప్రయోజనం, ₹ 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఎంపిక చేసిన కార్పొరేట్ ఉద్యోగులకు కార్ల కంపెనీ ₹5,000 అదనపు కార్పొరేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఇక డాట్సన్ గో హ్యాచ్ బ్యాక్ 5 సీటర్ మోడల్‌పై రూ. 40 వేల ఆఫర్ ప్రకటించింది. దీనిలో క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజీ బోనస్ కింద ఒక్కోటి రూ.20 వేల చొప్పున ఉంది. ఇటువంటి ఆఫరే గో ప్లస్ మోడల్‌పై కూడా ఉంది. 7 సీటర్ ఎంపీవీపై రూ.20 వేల నగదు లబ్ధి, రూ.20 వేలు ఎక్స్ఛేంజీ బోనస్ ఇస్తున్నారు. -
ఈ కంపెనీ కార్లపై భారీగా డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: మీరు తక్కువ ధరలో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, డాట్సన్ తమ కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీవిని జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తయారు చేసింది. ఈ కారు మొత్తం 5 వేరియంట్లను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారులో కంపెనీ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 68 పీఎస్ నుంచి 77 పీఎస్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్, సీవీటి ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి. డాట్సన్ తన వినియోగదారులకు రూ.40,000 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ వినియోగదారులకు రూ.20,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అదే సమయంలో, వినియోగదారులు కూడా రూ.20,000 వారి పాత కారు స్థానంలో కొత్త కారును తీసుకోవడం ద్వారా పొందవచ్చు. మార్కెట్లో డాట్సన్ గో ప్లస్(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ.4.25 లక్షల నుంచి రూ. 6.99 లక్షలుగా ఉంది. అలాగే రెనో ట్రైబర్ - ఈ 7 సీట్ల కారు 4 వేరియంట్లు (RXE, RXL, RXT, RXZ) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను ఉంది. ఇది 96 ఎన్ఎమ్ టార్క్, 72 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కారు యొక్క రెండవ వేరియంట్లో కంపెనీ 1.0-లీటర్ సామర్థ్యం గల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 160 ఎన్ఎమ్ టార్క్, 100 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుపై కంపెనీ 45,000 రూపాయల వరకు డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ చౌకైన ఎంపీవీపై రూ.15 వేల వరకు నగదు తగ్గింపు, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ. 5.30 లక్షల నుంచి రూ.7.65 లక్షలుగా ఉంది. చదవండి: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త! -
నిస్సాన్ బంపర్ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు!
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల ఉత్పత్తిదారు నిస్సాన్ ఇండియా వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. నిస్సాన్, డాట్సన్ మోడల్ కార్ల కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ వెల్లడించిన ఈ పండుగ బొనాంజా ఆఫర్లో కారు కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. దీంతోపాటు ఉచితంగా కారు గెల్చుకునే అవకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తోంది. దీంతోపాటు ఉచిత బీమా, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పోరేట్ ఆఫర్ సహా దాదాపు రూ. 71,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. నిస్సాన్, డాట్సన్ మోడళ్లపై వినియోగదారులకు అందిస్తున్న ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చినట్టు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు నిస్సాన్ , డాట్సన్ కారును ఈ పండుగ ఆఫర్లో సెప్టెంబర్19వ తేదీ లోపు కొనుగోలు చేస్తే ఉచితంగా కారు గెలు చుకునే అవకాశం. ఇలా తొమ్మిదిమంది లక్కీ విజేతలను ఎంపిక చేయనుంది. ప్రతి నిస్సాన్, డాట్సన్ కారు కొనుగోలుపై కస్టమర్లకు ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. అలాగే 7.99 శాతం వడ్డీతో నిస్సాన్ రెనాల్ట్ ఫైనాన్షియల సర్వీసెస్ ఇండియా ద్వారా రుణ సదుపాయం కూడా ఉంది. ‘పిల్లర్స్ ఆఫ్ ఇండియా’ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు డాట్సన్ రెడి-గోపై అదనంగా రూ.6వేల డిస్కౌంట్ అందిస్తోంది. మైక్రా ఎంసీ పై 39,000 రూపాయల వరకు, మైక్రా యాక్టివ్‌పై రూ. 34000 వరకు తగ్గింపు. (ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10వేలు, రూ. 4వేల కార్పొరేట్ ఆఫర్ కలిపి) డాట్సన్ మోడళ్లలో గో ప్లస్ పై రూ.16,000, రెడి గోపై రూ.14, 500, రెడీ గో (800) సీసీపై 13వేల వరకు ప్రత్యేక ఆఫర్ అందించనుంది. వీటిలో ఉచిత బీమా, రూ. 2,000 కార్పోరేట్ ఆఫర్ తదితరాలు ఉండనున్నాయి. -
సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్న నిస్సాన్ తక్కువ బడ్జెట్ లో డాట్సన్ బ్రాండ్ స్పోర్ట్స్ వెర్షన్ కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడున్నర లక్షల ధరలో 'రెడీ గో స్పోర్ట్ ' పేరుతో పరిమిత ఎడిషన్ ను లాంచ్ చేసింది. భారత రెజ్లర్ ఒలింపిక్ పతక విజేత సాక్షి మా లిక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. దీని ధరను రూ 3,49,479లు(ఢిల్లీ ఎక్స్‌షో రూం) గా కంపెనీ నిర్ణయించింది. డాట్సన్ రెడీ -గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త పండుగను సాక్షి మాలిక్ తో జరుపుకోవడం సంతోషంగా ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. రుబీ, వైట్, అండ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్నతమ అన్ని డాట్సన్ డీలర్ షిప్ లలో అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు ఒక స్పోర్టి-నేపథ్యాన్ని జోడిస్తుందని తెలిపారు. ఈ స్పోర్టీ రెడి-గో స్పోర్ట్ లో థీమ్ వీల్ కవర్, స్పోర్టి గ్రాఫిక్స్, స్పోర్టి రూఫ్ స్పాయిలర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పోర్టి డాష్ బోర్డ్ లాంటి కొత్త ఫీచర్లు ఇందులోఉన్నాయని కంపెనీ తెలిపింది. -
అమ్మకాల్లో దూసుకుపోతున్న 'చిన్నకారు'
న్యూఢిల్లీ: మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు పోటీగా జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టిన చిన్న కారు 'రెడి-గో' అమ్మకాల్లో దూసుకుపోతోంది. 23 రోజుల్లోనే 3 వేల కార్లు అమ్ముడయ్యాయి. జూన్ 7 నుంచి ప్రారంభమైన 'రెడి-గో' అమ్మకాలకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర తెలిపారు. 23 రోజుల్లో 3 వేల కార్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. వినియోగదారులకు పెద్ద సంఖ్యలో కార్లు డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 274 సేల్స్ అండ్ సర్వీసెస్ అవుట్‌లెట్స్ ద్వారా 'రెడి-గో' అమ్మకాలు సాగిస్తున్నామన్నారు. 'రెడి-గో' పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్లో నిర్ణయించారు. డాట్సన్ ఈ కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నారు. డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని నిస్సాన్ కంపెనీ తెలిపింది. -
డాట్సన్ కోసం ప్రత్యేక షోరూమ్‌లు
ఈ ఏడాదే సన్నీలో కొత్త మోడల్ డాట్సన్ గో ప్లస్ కూడా న్యూఢిల్లీ: నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ కార్ల కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా కార్ల విడిభాగాల సరఫరా చెయిన్‌ను మరింత మెరుగుపరుస్తున్నామని నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ కెనిచిరో యోముర చెప్పారు. ఉత్తర భారత్‌లో ఒకటి, పశ్చిమ భారత్‌లో మరొకటి చొప్పున మొత్తం రెండు కొత్త పంపిణి కేంద్రాలను ఏడాది కాలంలో ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం డాట్సన్ బ్రాండ్ కార్లను దేశవ్యాప్తంగా ఉన్న 130 నిస్సాన్ కార్ల షోరూమ్‌ల్లో విక్రయిస్తున్నామని, భవిష్యత్తులో డాట్సన్ కార్ల విక్రయాల కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటుచేయనున్నామని పేర్కొన్నారు. దాదాపు ముప్ఫైఏళ్ల తర్వాత నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది మార్చిలో డాట్సన్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రూ.3.12 లక్షల నుంచి రూ.3.70 లక్షల రేంజ్లో ఉన్న డాట్సన్ గో మోడల్‌ను అందిస్తోంది. ఈ ఏడాది 70 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, 2017, మార్చి కల్లా 300 షోరూమ్‌లు ఏర్పాటు చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్య కల్లా మిడ్-సైజ్ సెడాన్ సన్నీను, ఆ తర్వాత డాట్సన్‌లో రెండో మోడల్, డాట్సన్ గో ప్లస్‌ను అందించనున్నామని వివరించారు.