ఎగుమతుల క్షీణతతో మార్కెట్ డీలా..
రూపాయి బలహీనత ప్రభావం
- 189 పాయింట్లు క్షీణించి 27,878కు సెన్సెక్స్
- 41 పాయింట్లు క్షీణించి 8,477కు నిఫ్టీ
ఎగుమతుల డీలాకు రూపాయి క్షీణత తోడవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. జీఎస్‌టీ బిల్లుపై ఎలాంటి కదలిక లేకపోవడంతో బ్లూ-చిప్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ కీలకమైన 28 వేల పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 189 పాయింట్లు క్షీణించి 27,878 పాయింట్ల వద్ద నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,477 వద్ద ముగిశాయి.
బ్యాంకింగ్ జోరు..: అయితే బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రకటించడంతో బ్యాంక్ షేర్లు 15 శాతం దూసుకుపోయాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, వాహన, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పతనబాట పట్టినప్పటికీ, బ్యాంక్‌లు, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభపడటంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీల నష్టాలు కొంత మేరకు తగ్గాయి. ఒక దశలో 328 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 189 పాయింట్ల నష్టంతో 27,878 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,477 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 15 శాతం, కెనరా బ్యాంక్ 13.4 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 9 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4 శాతం, ఎస్‌బీఐ 4 శాతం చొప్పున పెరిగాయి.