ట్యూషన్ ఫీజుకు పన్ను మినహాయింపు ఎంత?
నేను బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున రూ.2,400 ట్యూషన్ ఫీజు పన్ను మినహాయింపు (ఒక ఆర్థిక సంవత్సరంలో) లభిస్తోంది. నా సోదరుడు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ట్యూషన్ ఫీజులో ఇలాంటి పరిమితులు లేవని చెప్పాడు. ఆదాయపు పన్ను విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తేడాలు ఎందుకు?
- భాస్కర్, బెంగళూరు
ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి తేడాలు ఉండవు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పిల్లల ట్యూషన్ ఫీజు విషయమై రెండు సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సెక్షన్ 10 కింద ఒక్కో పిల్లవాడికి రూ.1,200 (నెలకు రూ.100) చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లలకు అంటే రూ.2,400 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక సెక్షన్ 80సి కింద ట్యూషన్ ఫీజు కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) ఈఎల్‌ఎస్‌ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్), ఎన్‌ఎస్‌సీ(నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల్లో పెట్టుబడులన్నింటికీ కలిపి గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇవేమీ లేకుంటే కేవలం ట్యూషన్ ఫీజుకే రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు.
నేను ఇటీవలనే రిటైరయ్యాను. పన్ను ఆదా చేయడం కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో పెట్టుబడులను కొనసాగించవచ్చా? - విద్యా దేవి, విశాఖపట్టణం
రిటైరవ్వడం వల్ల ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయకూడదని ఏమీ లేదు. మీ పెట్టుబడులను ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో నిరంభ్యతరంగా కొనసాగించవచ్చు. ఇతర పన్ను ఆదా స్కీమ్‌లతో పోల్చితే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లోనే లాక్-ఇన్ పీరియడ్ తక్కువగా(మూడేళ్లు) ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు పొందవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఎలాంటి పన్నుల బాదరబందీ ఉండదు.
నా వయస్సు 43 సంవత్సరాలు. హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ ఫండ్-హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు 60 ఏళ్లు రాగానే ఈ హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ యూనిట్లను విక్రయిస్తే, నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? అలా కాకుండా నాకు 58 సంవత్సరాలు వచ్చే వరకూ హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ డెట్ ఫండ్‌కు బదిలీ చేసి, నాకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ డెట్ ఫండ్ యూనిట్లను విక్రయించిన సందర్భంలో పన్ను బాధ్యత ఎలా ఉంటుంది? - చిన్నారావు, విజయవాడ
హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ ఫండ్-హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ అనేది ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్. ఇతర ఈక్విటీ ఫండ్‌లకు వర్తించే పన్ను నియమాలే ఈ ఫండ్‌కు కూడా వర్తిస్తాయి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నారు. అంటే మీరు 17 ఏళ్లపాటు ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగిస్తారు. దీంతో ఈ ఫండ్ ద్వారా పొందే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత నియమనిబంధనల ప్రకారం, ఈక్విటీ ఫండ్స్‌లో ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించి, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ యూనిట్లను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం రాదు.
అయితే మీరు హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ ఈక్విటీ యూనిట్లను మీకు 59 సంవత్సరాల రాకముందే ఉపసంహరించుకుంటే మీరు 1 శాతం ఎగ్జిట్‌లోడ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ ఈక్విటీ యూనిట్లను హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ డెట్ ఫండ్‌కు బదిలీ చేసి, 60 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలని భావిస్తే, హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ డెట్ యూనిట్ల విక్రయంపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు 58వ ఏట బదిలీచేసి 60 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలనేది మీ ప్రణాళిక. అయితే డెట్ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ రెండేళ్ల వరకే ఉంటాయి. మీ డెట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మూడేళ్లలోపే ఉంటాయి కాబట్టి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు.
మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో అంటే ఏమిటి? ఒక ఫండ్ విశ్లేషణలో ఈ టర్నోవర్ రేషియో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
- సరళ, హైదరాబాద్
ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఆ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను ఎంత తరచుగా మార్చాడనేది మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో ద్వారా తెలుస్తుంది. టర్నోవర్ రేషియో అధికంగా ఉంటే, మీ ఫండ్ మేనేజర్ ఫండ్ పోర్ట్‌ఫోలియో షేర్లను అధికంగా మార్చాడని అర్థం. ఉదాహరణకు ఒక ఫండ్ టర్నోవర్ రేషియో రేట్ వంద శాతంగా ఉందనుకోండి. అంటే ఫండ్ పోర్ట్‌ఫోలియో షేర్లను ఫండ్ మేనేజర్ పూర్తిగా మార్చివేశాడని అర్థం. ఫండ్ నిర్వహణ తీరు ఎలా ఉందనేది టర్నోవర్ రేషియో సూచిస్తుంది.
తక్షణం లభించే అవకాశాలు, త్వరిత లాభాల కోసం ఫండ్ పోర్ట్‌ఫోలియోలో షేర్లను తరచుగా మారిస్తే టర్నోవర్ రేషియో అధికంగా ఉంటుంది. మరోవైపు షేర్లను కొనుగోలు చేసి, అలాగే హోల్డ్ చేస్తే టర్నోవర్ రేషియో తక్కువగా ఉంటుంది. టర్నోవర్ రేషియో అధికంగా ఉందంటే, లావాదేవీలు అధికంగా జరిగాయని అర్థం, దీంతో సహజంగానే లావాదేవీల వ్యయాలు పెరుగుతాయి. ఫండ్ వ్యయాల పేరుతో ఈ భారం ఇన్వెస్టర్లపైననే పడుతుంది. భారీగా లాభాలు వస్తేనే ఈ వ్యయాలకు అర్థం ఉంటుంది. అలారాని పక్షంలో ఫండ్‌ల పనితీరు ప్రభావితమవుతుంది.