సాక్షి,ముంబై : పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. ముంబైకి సమీపంలోని నీరవ్‌కు చెందిన విలాసవంతమైన అలీబాగ్ బంగ్లా కూల్చివేతకు అధికారులు ఆదేశాలిచ్చారు. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాయిఘడ్ జిల్లా కలెక్టర్ సూర్యవంశి వెల్లడించారు. చాలా దృఢమైన ఈ భవాన్ని కూల‍్చడానికి కొంత సమయం పడుతుందని, రెండు బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లతో ఇప్పటికే పని ప్రారంభించినట్టు తెలిపారు.
సముద్ర తీరంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఈ భవనాన్ని నీరవ్‌మోదీ నిర్మించారని తేల్చిన అధికారులు శుక్రవారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భవనంతో పాటు మరో 58 భవనాలు అక్రమంగా నిర్మించారని అధికారులు ప్రకటించారు. దాదాపు 30వేల చదరపు అడుగుల్లో విస్తరించిన వున్న ఈ బంగ్లా విలువ రూ.42కోట్లు వుంటుందని గతంలోనే ఈడీ ప్రకటించింది.
కాగా బీచ్ తీరంలో అక్రమ భవనాలు, హోటళ్లు, రిస్టార్ట్‌లను తొలగించాల్సిందిగా కోరుతూ ఎన్‌జీవో కార్యకర్త శాంబూర్జే యువ క్రాంతి 2009లో హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇది అక్రమమైన కట్టడమేనని కలెక్టర్ సూర్యవంశి గత ఏడాది డిసెంబరులో ధృవీకరించారు. దీంతో కోర్టు ఆయా భవనాల కూల్చివేతకు ఆదేశించింది. అలాగే దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా నీరవ్‌మోదీ తదితరులకు నోటీసులు పంపించినా, ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీతో సంప్రదింపుల అనంతరం కూల్చివేతకు నిర్ణయించామని కలెక్టరు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment