
డెబిట్ కార్డుపై ఎండీఆర్ చార్జీలు తగ్గింపు
• ఆర్‌బీఐ ప్రతిపాదనలు
• ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి...
ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం డెబిట్ కార్డు వాడకాన్ని మరింతగా పెంచే దిశగా ఆర్‌బీఐ చర్యలు ప్రారంభించింది. డెబిట్ కార్డుపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను ఏప్రిల్ 1 నుంచి గణనీయంగా తగ్గించాలని ప్రతిపాదించింది. వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులు, ప్రత్యేక విభాగం కిందకు వచ్చే వ్యాపారులు (విద్యా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూ రెన్స్, యుటిలిటీలు), ప్రభుత్వ ఆస్పత్రులు డెబిట్ కార్డు లావాదేవీల విలువపై 0.40% చార్జీ చెల్లించేలా ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఎండీఆర్ అనేది డెబిట్ కార్డు లావాదేవీల విలువపై దుకాణాదారుల నుంచి వసూలు చేసే చార్జీ. డిజిటల్ విధానంలో (క్యూఆర్‌కోడ్) లావాదేవీ జరిగితే ఎండీఆర్‌ను కేవలం 0.30%గానే ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
ప్రస్తుతం ఈ ఎండీఆర్ చార్జీ అనేది రూ.2,000 విలువ వరకు లావాదేవీలపై 0.75%గా ఉంది. ఆపై విలువగల లావాదేవీలకు 1% చార్జీ ఉంది. ఇక క్రెడిట్ కార్డు లావాదేవీలపై వసూలు చేసే ఎండీఆర్‌లో ఎటువంటి మార్పులను ఆర్‌బీఐ పేర్కొనలేదు. ఈ మేరకు ముసాయిదాను విడుదల చేసిన ఆర్‌బీఐ వీటిపై ఈ నెల చివరి వరకు ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం పలికింది. అనంతరం ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎండీఆర్ చార్జీలను ఆర్‌బీఐ తగ్గించింది. ఇవి మార్చి వరకు అమల్లో ఉండనున్నాయి.
ఏప్రిల్ నుంచి ఈ చార్జీలను మరింత తగ్గించడం ద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని విస్తృతం చేయాలని ఆర్‌బీఐ భావించింది. నిజానికి ఎండీఆర్‌ను దుకాణాదారులే చెల్లించాల్సి ఉండగా, కొంత మంది వ్యాపారులు దాన్ని కస్టమర్ల నుంచి రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కన్వీనియెన్స్ లేదా సేవా చార్జీని కస్టమర్లు చెల్లించ్సాలిన అవసరం లేదని’ పేర్కొంటూ వ్యాపారులు బోర్డులను పెట్టేలా బ్యాంకులు చూడాలని కూడా ఆర్‌బీఐ తన ముసాయిదాలో కోరింది. ‘‘కార్డు లావాదేవీల్లో పెరుగుదల కనిపిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మళ్లిన చిన్న వ్యాపారస్థులను ఈ విధానాన్ని కొనసాగించేలా చూడాలి’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.
నాలుగు విభాగాలు: ఆర్‌బీఐ వర్తకులను 4 కేటగిరీలుగా పేర్కొంది. వార్షికంగా రూ.20 లక్షల్లోపు టర్నోవర్ కలిగిన వారు, రూ.20 లక్షలకు మించిన టర్నోవర్; ప్రభుత్వ లావాదేవీలు, ప్రత్యేక కేటగిరీ వర్తకులు. ప్రభుత్వ లావాదేవీలు అయితే రూ.1,000 వరకు లావాదేవీపై ఫ్లాట్‌గా రూ.5 చార్జీ, రూ.1,001 నుంచి రూ.2,000 వరకు ఫ్లాట్‌గా రూ.10 చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. రూ.2,001కి పైన విలువగల లావాదేవీలపై మొత్తం లావాదేవీ విలువలో చార్జీ 0.50% మించరాదు. అదీ రూ.250 వరకు మాత్రమే గరిష్ట పరిమితి. పెట్రోల్ బంకుల్లో కార్డుల వాడకంపై ఎండీఆర్ చార్జీ విషయంలో పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత ఆర్‌బీఐ నిర్ణయించనుంది.