డాయిష్ బ్యాంకు సీఈవో క్రిస్టియన్ సెవింగ్ (పాత ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన అతిపెద్ద బ్యాంకు డాయిష్ బ్యాంక్ భారీగా ఉద్యోగులపై వేటువేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు పదివేల ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు సీఈవోగా క్రిస్టియన్ సెవింగ్ నియమితులైన ఒక నెలరోజుల్లోనే ఈ కీలక నిర్ణయం వెలువడింది. అతి కఠినమైన పరిస్థితులు, నిర్ణయాలు ముందున్నాయని ఇప్పటికే బ్యాంకు వాటాదార్ల సమావేశంలో హెచ్చరించిన సీఈవో, కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో దాదాపు 10శాతం తగ్గించుకోనున‍్నట్టు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను 10 శాతం అంటే 117 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8 లక్షల కోట్లు) మేర తగ్గిస్తున్నట్లు యురోపియన్ ఫైనాన్షియల్ సర్వీస్ మేజర్ డాయిస్ తెలిపింది. పునర్నిర్మాణ పథకంలో వ్యయాల్లో కోత పెట్టడం తద్వారా బ్యాంకును లాభాల్లోకి తెచ్చేందుకు సాధ్యమైన యత్నాలన్నీ చేస్తామని, కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ సెవింగ్ హామీ ఇచ్చిన రోజే, ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి ఉద్యోగులు 97,000 మంది ఉన్నారని, 10శాతం కోతతో ఈ సంఖ్యను సుమారు 90,000కు పరిమితం చేస్తామని బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే ఈ తొలగింపు ప్రారంభమైందని వెల్లడించింది. ఈక్విటీలు, విక్రయాల విభాగాల్లోనే నాలుగోవంతు తొలగింపులుంటాయని, పనితీరు బాగాలేని వారిపై వేటు పడుతుందని స్పష్టం చేసింది. ఐరోపాలో రిటైల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలుంటాయని, కార్పొరేట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌కు కట్టుబడి ఉన్నామనీ వివరించింది. ఈ వార్తలతో ప్రాంక్‌ఫర్ట్ మార్కెట్‌లో డాయిష్ బ్యాంకు షేరు 6శాతం కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment