ఒకే ఖాతాతో ఇద్దరికీ పన్ను ప్రయోజనాలు వస్తాయా? | dheerendra kumar advice for finance and insurance | Sakshi
Sakshi News home page

ఒకే ఖాతాతో ఇద్దరికీ పన్ను ప్రయోజనాలు వస్తాయా?

Published Mon, Feb 27 2017 1:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

ఒకే ఖాతాతో ఇద్దరికీ పన్ను ప్రయోజనాలు వస్తాయా?

ఒకే ఖాతాతో ఇద్దరికీ పన్ను ప్రయోజనాలు వస్తాయా?

మూడు నుంచి ఆరు నెలల కాలానికి మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌ను వెల్లడించండి. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే  వచ్చే లాభాలపై పన్నులు ఉంటాయా? – సుదర్శన్, విజయవాడ

మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్‌ చేయడానికి లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను గానీ, ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను గానీ పరిశీలించవచ్చు. లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మూడు నెలల కాల వ్యవధి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలు, సర్టిఫికెట్‌  ఆఫ్‌ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ లిక్విడ్‌ ఫండ్స్‌లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఎప్పుడైనా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. ఈ లిక్విడ్‌ మ్యూచువల్‌  ఫండ్స్‌ నుంచి వైదొలగడానికి ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. ఉపసంహరణ ప్రక్రియ మొత్తం కేవలం రెండు రోజుల్లోనే పూర్తవుతుంది. పన్ను భారం పోను వార్షిక రాబడి 4–7% రేంజ్‌లో ఉంటుంది. ఇక ఆల్ట్రా–షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ 91 రోజులు మించిన, ఏడాదిన్నర లోపు మెచ్యూరయ్యే డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ ఫండ్స్‌ నుంచి వైదొలగితే ఎగ్జిట్‌ లోడ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈక్విటీ ఫండ్స్‌ విషయానికొస్తే, వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి, ఏడాదిలోపే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. దీర్ఘకాలం... కనీసం ఐదేళ్ల పాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మంచి రాబడులు పొందవచ్చు.

నాకు, నా భార్యకు విడివిడిగా పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) ఖాతాలున్నాయి. ప్రతి ఏడాది ఒక్కో ఖాతాలో రూ.1.5 లక్షలు చొప్పున జమ చేస్తున్నాం. ప్రస్తుతం ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాం. ఇద్దరం కలసి ఒకే ఖాతా తెరిచి రూ. 3 లక్షలు ఇన్వెస్ట్‌ చేయాలని యోచిస్తున్నాం. ఇలా ఇన్వెస్ట్‌ చేసి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌80 సి కింద లభించే రూ. లక్షన్నర రాయితీని నేను. నా భార్య ఇరువురమూ పొందవచ్చా?    – రాము, విశాఖపట్టణం

మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయంలో ప్రైమరీ హోల్డర్‌కి మాత్రమే అన్ని పన్ను ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది. అలాగే పన్ను బాధ్యత కూడా ఆ వ్యక్తికే  ఉంటుంది. మూలధన లాభాల పన్ను తదితర పన్నులను మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోకి సంబంధించి ప్రైమరీ హోల్డర్‌కే ఉంటుంది. అందుకని మీరు ఇద్దరూ ఒకే మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియో కింద రూ.3 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి చెరో రూ. లక్షన్నర వరకూ పన్ను రాయితీ పొందే అవకాశం లేదు. మీలో అధికాదాయం ఉన్నవారు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి, తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించే అంశాన్ని పరిశీలించండి.

మా అమ్మగారు సీనియర్‌ సిటిజన్‌. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆమె సుముఖంగా లేరు. 10–15 సంవత్సరాలకు పన్ను భారం పోను మంచి రాబడులు కావాలనుకుంటే ఏ ఏ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌–పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌)ను ఎంచుకోమంటారా? లేక ఆల్ట్రా షార్ట్‌ టర్మ్,  షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయమంటారా? తగిన సలహా ఇవ్వండి. 
      – నిరంజన్, హైదరాబాద్‌

పన్ను ప్రయోజనాలు, గ్యారంటీగా రిటర్న్‌లు రావాలంటే డెట్‌ ఫండ్స్‌ కంటే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే ఉత్తమం. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసినప్పుడూ, రాబడులు పొందినప్పుడూ.. పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పీపీఎఫ్‌కు లాక్‌–ఇన్‌–పీరియడ్‌ 15 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడులే వస్తాయి. ఇప్పుడు పీపీఎఫ్‌పై చెల్లించే వడ్డీరేట్లను మూడు నెలలకొకసారి సవరిస్తున్నారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలనుకునే పక్షంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్తమం. ఇన్వెస్ట్‌ చేసిన మూడేళ్లలోపు డెట్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయిస్తే, మీ అమ్మగారు ఏ ఆదాయపు పన్ను స్లాబ్‌ కిందకు వస్తారో, ఆ స్లాబ్‌కు వర్తించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఒక వేళ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (20 శాతం) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌లో లాగానే డెట్‌ మార్కెట్లో కూడా ఒడిదుడుకులు బాగానే ఉంటాయి. డెట్‌మార్కెట్లో వివిధ బాండ్ల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటుంది. అందుకని డెట్‌ ఫండ్స్‌ రాబడులు సంవత్సరం సంవత్సరం మారుతూనే ఉంటాయి. కానీ 10–15 సంవత్సరాలు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి పెట్టుబడి సాధనాలు. మంచి రాబడులనిస్తాయి. పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈక్విటీలు వద్దనుకుంటే, పీపీఎఫ్‌.. ఉత్తమమైన పెట్టుబడి సాధనం.

నేను మ్యాక్స్‌ లైఫ్‌ ఫాస్ట్‌ట్రాక్‌ సూపర్‌ యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ను  ఇటీవలే తీసుకున్నాను. ఏడాదికి 75,000 చొప్పున ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించాను. పదేళ్ల తర్వాత నాకు రూ.7.5 లక్షలు వస్తాయి. ఈ ప్లాన్‌ను నేను సరెండర్‌ చేయాలనుకుంటున్నాను. సంస్థ రూ.6,000 మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల తర్వాత నాకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా లేక వైదొలగమంటారా? తగిన సలహా ఇవ్వండి.   – కిషన్, వరంగల్‌

ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయడం వల్ల మీకు నష్టాలు వస్తాయి. అయినప్పటికీ, ఈ ప్లాన్‌ నుంచి వైదొలగడమే ఉత్తమమని మేము భావిస్తున్నాం. ఈ ప్లాన్‌ లాక్‌–ఇన్‌ పీరియడ్‌ పూర్తయిన తర్వాతనే మీకు అప్పటి ఫండ్‌ విలువను బట్టి సొమ్ములు వస్తాయి. ఈ ప్లాన్‌లు మంచి రాబడులను ఇవ్వలేవు. పైగా తగినంత బీమా కవరేజ్‌ను కూడా అందించలేవు. అందుకని ఈ ప్లాన్‌ నుంచి వైదొలగడమే మంచిది. జీవిత బీమా అవసరాల కోసం టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి.

ఈ టర్మ్‌ బీమా పాలసీలకు ప్రీమియమ్‌ తక్కువగా ఉంటుంది. బీమా కవరేజ్‌ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు తీసుకున్న యులిప్‌ను సరెండర్‌ చేస్తారు. కాబట్టి దానికి చెల్లించే రూ.75,000 ప్రీమియమ్‌ను రెండు మంచి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందుతారు. బీమా కోసం టర్మ్‌  బీమా పాలసీ, ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే.. ప్రస్తుతం మీరు ఇన్వెస్ట్‌ చేసే యులిప్‌కన్నా మెరుగైన రాబడులు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement