గృహ రుణాల సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఇచ్చిన రుణాల విషయంలో మోసం(ఫ్రాడ్) జరిగినట్లు తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) పేర్కొంది. రూ. 3688 కోట్లమేర రుణాలను డీహెచ్ఎఫ్‌ఎల్ మోసపూరితంగా తీసుకున్నట్లు పీఎన్‌బీ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు నివేదించింది. ఈ రుణాలకు సంబంధించి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మోసపూరిత ఖాతాలపై నాలుగు త్రైమాసికాలలో 100 శాతం ప్రొవిజనింగ్‌ను చేపట్టవలసి ఉంటుంది. దీంతో ఇప్పటికే డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఖాతాపై రూ. 1246 కోట్ల ప్రొవిజనింగ్‌ను చేపట్టినట్లు పీఎన్‌బీ వెల్లడించింది.
షేరు డౌన్
డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఖాతా మోసపూరితమని వెల్లడించిన నేపథ్యంలో పీఎన్‌బీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు 5.5 శాతం పతనమై రూ. 35 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇప్పటికే పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్‌తోపాటు.. ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ సైతం డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరిత ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. రూ. 85,000 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి.. దివాళా కోర్టులకు చేరిన తొలి ఫైనాన్షియల్ సేవల కంపెనీగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ నిలిచినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment