
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డులను క్రాస్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ర్యాలీ కొనసాగిస్తుండటంతో, దేశీయంగా సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. నేడు డీజిల్ ధరలు లీటరుకు రూ.61.74 వద్ద రికార్డు గరిష్టాలను తాకగా.. పెట్రోల్ ధరలు లీటరు 71 రూపాయలు దాటేశాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర సోమవారం రూ.71.18కు పెరిగింది. 2014 ఆగస్టు తర్వాత ఇదే అత్యధిక గరిష్ట స్థాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర రూ.61.74 గా రికార్డైంది. ముంబైలో మరింత ఎక్కువగా రూ.65.74గా నమోదయ్యాయి. ముంబైలో స్థానిక విక్రయ పన్ను అత్యధికంగా ఉండటంతో ఢిల్లీలో కంటే కూడా డీజిల్ ధరలు అక్కడ ఎక్కువగా ఉన్నాయని ఆయిల్ కంపెనీల డేటాలో వెల్లడైంది.
రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ డ్యూటీలను సైతం తగ్గించింది. కానీ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ర్యాలీ కొనసాగిస్తుండటం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో గత నెల నుంచి డీజిల్ ధరలు రూ.3.4 పెరుగగా.. పెట్రోల్ ధరలు రూ.2.09 పెరిగాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించినా.. రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. రాష్ట్రాలు సైతం వ్యాట్ తగ్గించాలని ఇటు కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. కొన్ని ప్రభుత్వాలు తగ్గించినప్పటికీ, మిగతా ప్రభుత్వాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించకుండా.. వినియోగదారులపై ఆ మోత మోగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment