
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్ ధరలు ఇటీవల వాహనదారులకు కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో డీజిల్ ధర ఆల్-టైమ్ హైలోకి ఎగిసింది. ఒక్క ఢిల్లీలో మాత్రమే కాక ఇతర నగరాల్లోనూ ఈ ధర భారీగా పెరిగినట్టు తెలిసింది. రోజువారీ ధరల సమీక్ష ప్రకారం సోమవారం లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.59.07గా రికార్డైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2002 నుంచి ఇదే అత్యధిక స్థాయి. కోల్‌కత్తాలోనూ డీజిల్ ధర మూడేళ్ల గరిష్టంలోకి ఎగిసింది. ముంబై, చెన్నైలో కూడా ఈ ధర అత్యధిక స్థాయిలో నమోదవుతుందని తెలిసింది. కోల్‌కత్తా, ముంబై, చెన్నైలో 2014 ఆగస్టులో డీజిల్ ధర జీవిత కాల గరిష్ట స్థాయిలను నమోదుచేసింది. ప్రస్తుతం కూడా ఇదే స్థాయిలో డీజిల్ ధర దూసుకుపోతోంది. అమెరికాలో హరికేన్ ప్రభావంతో రిఫైనరీ తగ్గిపోవడంతో అంతర్జాతీయంగా డీజిల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ధరల పెరగడం డీజిల్ వాహన యజమానులకు, డీజిల్‌తో ఉత్పత్తి అయ్యే పవర్‌పై ఆధారపడిన వ్యవసాయదారులకు, వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఒక్క డీజిల్ మాత్రమే కాక పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.79.94గా నమోదైంది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక గరిష్ట స్థాయి. ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్ ధరలు కాకపుట్టిస్తున్నట్టు వెల్లడవుతోంది. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరు రూ.7.74, రూ.5.74 మేర పెరిగినట్టు ఆయిల్ కంపెనీల డేటాలో తెలిసింది. అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు సుమారు 12 శాతం పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 59 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ రేట్ల ప్రభావం దేశీయ ఇంధన రేట్లపై పడటం, దేశీయంగా పన్నుల వ్యవస్థ వంటి కారణాలతో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పైకి ఎగుస్తున్నాయి. రోజువారీ ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి పెంపు అత్యధికంగా ఉంది. స్థానిక లెవీల ప్రకారం, రాష్ట్ర, రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.