చిన్న సంస్థల లాభాలకు ఆన్‌లైన్ బూస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్‌కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంబీ) వెబ్‌సైట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక తోడ్పాటు అందిస్తున్నట్లు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అలాన్ థిగ్నెస్ తెలిపారు. సాధారణ సంస్థలతో పోలిస్తే ఆన్‌లైన్ మాధ్యమంలో కూడా ఉన్న సంస్థల ఆదాయాలు 51 శాతం, లాభాలు 49 శాతం అధికంగా ఉంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే గడిచిన రెండేళ్లలో 3 లక్షల పైగా చిన్న సంస్థలు వెబ్‌సైట్లు ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటునిచ్చినట్లు అలాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు.
ఈ-కామర్స్ వృద్ధి...
డొమైన్, వెబ్‌సైట్ హోస్టింగ్ మొదలైనవి ఏడాది పాటు ఉచితంగానే అందిస్తున్నామని, రెండో ఏడాది నుంచి గూగుల్‌తోనే కొనసాగాలా వద్దా అన్నది ఆయా సంస ్థల అభీష్టంపై ఆధారపడి ఉంటుందని గూగుల్ ఇండి యా చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార విభాగ హెడ్ కె. సూర్యనారాయణ చెప్పారు. దేశీయంగా 4.7 కోట్ల పైగా ఎస్‌ఎంబీలు ఉండగా.. కేవలం 5 శాతం సంస్థలకు మాత్రమే వెబ్‌సైట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్.. 2020 నాటికి 80-100 బిలియన్ డాలర్ల దాకా చేరగలదన్నారు. అలాగే, 2015 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 20 కోట్ల నుంచి సుమారు 35 కోట్లకు చేర గలదని అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.