
డీఎల్‌ఎఫ్ లాభం 24 శాతం అప్
న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.132 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.164 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్ తెలిపింది. ఆదాయం రూ.1,957 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.2,828 కోట్లకు పెరిగిందని వివరించింది.
ఇతర ఆదాయం రూ.123 కోట్ల నుంచి రూ.153 కోట్లకు ఎగసిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.8 కోట్లుగా ఉన్న పన్ను వ్యయాలు ఈ క్యూ3లో రూ.211 కోట్లకు పెరిగాయని, అలాగే వడ్డీ భారం రూ.648 కోట్ల నుంచి రూ.672 కోట్లకు ఎగసిందని వివరించింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. పలితాల నేపథ్యంలో డీఎల్‌ఎఫ్ షేర్ 3.5 శాతం నష్టపోయి రూ.94 వద్ద ముగిసింది.