పసిడి దిగుమతులపై ఆంక్షలు మరికొంత కాలం
న్యూఢిల్లీ: ఇరాక్, కొన్ని ఇతర దేశాల్లోని పరిణామాలు కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బంగారం దిగుమతులపై ఆంక్షలను ఇప్పుడే సడలించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. క్యాడ్ సమస్య అదుపులోకి వచ్చినప్పటికీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ ఆదివారం మీడియాతో చెప్పారు.
‘ఇరాక్, మధ్య ప్రాచ్య దేశాల్లో సంఘర్షణలతో చమురు ధరలు ఎగిసి దిగుమతుల బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా క్యాడ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ మారక ప్రవాహం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే పుత్తడి దిగుమతులపై ఆంక్షల సడలింపుపై దృష్టిసారించగలం’ అని వివరించారు. బంగారం, పెట్రోలియం దిగుమతులు పెరిగిపోవడంతో 2012-13లో కరెంటు అకౌంటు లోటు రికార్డు స్థాయిలో 8,800 కోట్ల డాలర్లకు (స్థూల జాతీయోత్పత్తిలో 4.7 శాతం) చేరింది. తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడంతో గతేడాది ఇది 3,240 కోట్ల డాలర్లకు(జీడీపీలో 1.7%) దిగివచ్చింది.
కాగా స్విట్జర్లాండ్ జూన్‌లో భారత్‌కు రూ. 11,000 కోట్ల విలువైన బంగారం, వెండిలను ఎగుమతి చేసింది. స్విట్జర్లాండ్ మొత్తం ఎగుమతుల్లో (రూ.26,000 కోట్లు) ఇది 42 శాతానికి సమానమని స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది మే దిగుమతులతో పోల్చితే 33 శాతం అధికమని పేర్కొంది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే భారత్‌కు స్విట్జర్లాండ్ రూ.50 వేల కోట్ల విలువైన బంగారం, వెండిలను ఎగుమతి చేసింది.