ముంబై : సింగపూర్ తో పన్ను ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారత్ పునః సంప్రదింపులకై చూస్తోంది. అయితే పన్ను పద్ధతిలో మారిషస్ తో సమానంగా సింగపూర్ ను చూడొద్దని విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్ పీఐ) అంటున్నారు. ఇటీవలే మారిషస్ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన లాభ పన్నును విధించాలని ఆ ప్రభుత్వంతో కేంద్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పన్నునే సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులకు విధిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే మారిషస్ ఒప్పందమే సింగపూర్ ప్రభుత్వంతో కూడా కుదుర్చుకుంటే, సింగపూర్ నుంచి భారత్ లోకి వచ్చే పన్నులు చాలా కఠినతరం అవుతాయని ఎఫ్ పీఐలు పేర్కొంటున్నారు. ఈ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై కొంత వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మారిషస్ తో పోల్చుకుంటే సింగపూర్ లో చాలా కఠినతరమైన నిబంధనలుంటాయని, అక్రమాలకు పాల్పడే అవకాశం తక్కువ ఉంటాయని చెప్పారు.
వచ్చే ఏడాది మార్చి వరకల్లా సింగపూర్ తో పన్ను ఒప్పందం కుదుర్చుకుంటామని ఆర్థిక సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఎఫ్ పీఐలతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. ఒకవేళ పన్ను ఒప్పందం కుదరకపోయినా, మూలధన లాభాలపై పన్ను విధించే అధికారం భారత్ కు ఉంటుందని పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ నుంచి ఫుల్ రేటుతో పన్ను విధిస్తామని చెప్పారు.
మారిషస్ లో ఒక్కసారి టాక్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ పొందాకా, వారు ఎలాగైనా పెట్టుబడులను ఇతర దేశాలకు మళ్లించవచ్చని, కానీ సింగపూర్ లో అలా కాదని, పెట్టుబడులపై కఠినతరమైన నిబంధనలు, చెల్లింపులు ఉంటాయని టాక్స్ అడ్వైజర్ ఒకరు తెలిపారు. సింగపూర్ ప్రతినిధులతో భారత ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రతినిధులు వచ్చే వారంలో భేటీ కానున్నారు. ఈ విషయంపై సింగపూర్ ప్రతినిధులతో చర్చించనున్నారు. అయితే సింగపూర్ నుంచి భారత్ కు వచ్చే పెట్టుబడులు 16శాతం వరకూ ఉన్నాయి. మారిషస్, సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ దేశాలతో పన్ను ఒప్పందాలు లేకపోవడంతో, అక్రమ మార్గాల ద్వారా నగదును ఆ దేశాలకు తరలించి, మళ్లీ పెట్టుబడుల రూపంలో భారత్ కు తెస్తున్నారని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఇలా భారీగా నల్లధనం పెరిగిపోతుందని భావించిన ప్రభుత్వం ఆ దేశ పెట్టుబడులపై మూలధన లాభ పన్ను విధించాలని నిర్ణయించింది.