బెదిరించొద్దు.. నోటీసులొద్దు
⇒ పన్ను అధికారులకు సీబీడీటీ సూచన
⇒ భారీ డిపాజిట్ ఖాతాల పరిశీలనకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ తర్వాత భారీ మొత్తాల్లో నగదు జమ అయిన ఖాతాల పరిశీలన సందర్భంగా పన్ను చెల్లింపుదారులను బెదిరించడం, హెచ్చరించడం లేదా షోకాజు నోటీసులు జారీ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదాయపన్ను శాఖ అధికారులకు సూచించింది. పెద్ద మొత్తాల్లో జమ చోటు చేసుకున్న అనుమానాస్పద ఖాతాల పరిశీలనకు, నల్లధనం ఏరివేతకు గాను ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.5 లక్షలకు మించి నగదు జమ అయిన 18 లక్షల మందిని వివరాలు కోరుతూ ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్‌ను ఆదాయపన్ను శాఖ పంపింది. వీరిలో 6 లక్షల మంది ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా బదులిచ్చారు.
కాగా, అనుమానాస్పద ఖాతాల పరిశీలనను చేపట్టే అధికారులకు తొలిసారిగా సూచనలతో కూడిన 8 పేజీల పత్రాన్ని సీబీడీటీ తాజాగా జారీ చేసింది. ఐటీ అధికారుల నుంచి వేధింపులు ఎదురు కావచ్చంటూ పన్ను చెల్లింపుదారులు, ఇతరుల నుంచి సందేహాలు వ్యక్తం కావడంతో వీటిని జారీ చేశారు. ముఖ్యాంశాలు...
⇔ తనిఖీలో భాగంగా ఏ ఒక్క వ్యక్తీ ఏ పరిస్థితుల్లోనూ, ఏ దశలోనూ వ్యక్తిగతంగా ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా చూడాలి.
⇔ ఆన్‌లైన్‌లో వ్యక్తులతో సంప్రదింపుల సమయంలో గౌరవంగా వ్యవహరించాలి. వాడే పదాల్లో బెదిరింపు లేదా హెచ్చరికల వంటివి ఉండకూదదు. షోకాజ్ నోటీసు ఇవ్వరాదు.
⇔ సంబంధిత విచారణలన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాలి. ఇదంతా ప్రాథమిక స్థాయి పరిశీలనే.
⇔ అసెసింగ్ అధికారులు ఆన్‌లైన్ పోర్టల్ మినహా స్వతంత్ర విచారణ లేదా మూడోపక్షం ద్వారా తనిఖీలు నిర్వహించరాదు.
⇔ తనిఖీలో ఎలాంటి సమాచారమైనా దాన్ని సంబంధిత వ్యక్తి నుంచి ఆన్‌లైన్ వేదికగానే సేకరించాలి.
⇔ పన్ను చెల్లింపుదారుడు ఇచ్చిన వివరణతో అసెసింగ్ అధికారి సంతృప్తి చెందితే సంబంధిత కేసును ఎలక్ట్రానిక్ విధానంలోనే మూసివేయాలి.
హవాలా డిపాజిట్లు అయితే విచారణ తప్పదు: సీబీడీటీ
మనీ లాండరింగ్ లేదా షెల్ కంపెనీ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేసినట్టు అనుమానం ఉన్న ఏ బ్యాంకు ఖాతానూ ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమం కింద విచారణ నుంచి మినహాయించడం కుదరదని సీబీడీటీ తేల్చి చెప్పింది. ఫలానా బ్యాంకు ఖాతా మనీ లాండరింగ్‌కు వినియోగించినట్టు, పన్ను ఎగవేతకు, షెల్ కంపెనీల్లోకి పంపేందుకు ఉపయోగించనట్టు తగిన సమాచారం ఉన్నా లేదా అనుమానించినా అటువంటి ఖాతాలపై విచారణ ఉంటుంది.
ఏదేనీ ఒక వ్యక్తి వ్యాపార ఆదాయం లేకుండా ఉండి, రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసి ఉంటే వారి ఖాతాల తనిఖీ ఉండదని సీబీడీటీ లోగడ స్పష్టం చేసింది. ఖాతాలో నగదు డిపాజిట్లు ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించిన మేరకు ఉంటే సంబంధిత వ్యక్తులు అదనంగా ఎటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఖాతాల్లో ఏదేనీ వ్యత్యాసాలు ఉంటే తనిఖీ నిర్వహిస్తారు. ఒకవేళ తాము డిపాజిట్ చేసిన నగదు స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం కింద పేర్కొన్నదని తెలియజేస్తే ఎటువంటి విచారణ ఉండదని సీబీడీటీ స్పష్టం చేసింది.