బీఎస్‌ఈ ఐపీఓకు భారీ స్పందన
51 రెట్లు బిడ్స్
న్యూఢిల్లీ: బీఎస్‌ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. దేశంలో తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ, ఈ ఏడాది తొలి ఐపీఓ కూడా అయిన బీఎస్‌ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. ఐపీఓలో భాగంగా రూ. 2 ముఖవిలువ గల 1.54,27,197(28.26% వాటా) షేర్లను జారీ చేయనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు మినహా జారీ చేయనున్న 1,07,99,039 షేర్లకు గాను 55,23,34,986 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. బుధవారం ముగిసిన రూ.805–806 ఇష్యూ ధరగా ఉన్న ఈ రూ.1,243 కోట్ల ఐపీఓకు రూ.44,000 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)లకు కేటాయించిన వాటా 49 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 159 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 6 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి.
డిమోనేటైజేషన్ తర్వాత వచ్చిన తొలి ఐపీఓ ఇది. 11.31 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సొంత ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అనుమతించనందున మరో దేశీయ స్టాక్ ఎక్సే్చంజ్ ఎన్‌ఎస్‌ఈలో బీఎస్‌ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి. గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా బీఎస్‌ఈ రూ.373 కోట్లు సమీకరించింది. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ బీఎస్‌ఈనే. త్వరలో ఎన్‌ఎస్‌ఈ రూ.10,000 కోట్ల ఐపీఓ రానున్నది.