దలాల్ స్ట్రీట్‌కు కాస్త ముందస్తుగానే దివాలి పండుగ వచ్చేసింది. మార్కెట్లు దూసుకుపోతుండంతో ఇన్వెస్టర్లు దివాలి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బ్యాంకు షేర్లు జోరుతో నిఫ్టీ సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. సెప్టెంబర్19 నాటి రికార్డు స్థాయి 10,178.95ను దాటేసిన నిఫ్టీ, 10,179.15 మార్కును టచ్ చేసింది. సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల మేర ర్యాలీ జరిపింది. ప్రస్తుతం సెన్సెక్స్ 287 పాయింట్ల లాభంలో 32,469 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంలో 10,177 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లకు డిమాండ్ ఊపందుకోవడంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1.25 శాతం మేర జంప్ చేసింది.
మార్కెట్లు రికార్డు దిశగా దూసుకుపోతుండటంతో ఇన్వెస్టర్లు చిన్న షేర్లలోనూ కొనుగోలు చేపడుతున్నారు. మరోవైపు టాటా టెలిసర్వీసెస్‌ను తనలో విలీనం చేసుకోబోతుండటంతో, ఎయిర్‌టెల్ షేర్లు కూడా భారీగా దూసుకుపోతున్నాయి. 7.43 శాతం మేర లాభంలో రూ.430 వద్ద నమోదవుతున్నాయి. సానుకూలమైన స్థూల ఆర్థిక డేటా, మెగా టెలికాం డీల్, కంపెనీల ఫలితాలు, దేశీయ కరెన్సీ బలపడటం నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లకు సహకరించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసల లాభంలో 64.90 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment