వరుసగా నాలుగో రోజు మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించి 36,400ను తాకగా.. నిఫ్టీ 136 పాయింట్లు బలపడి 10,700ను అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ ఈక్లర్క్స్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ సంస్థ శోభా లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఈక్లర్క్స్ సర్వీసెస్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ఐటీ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రతిపాదించింది. ఈ అంశంపై నేడు బోర్డు నిర్వహిస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బైబ్యాక్ కోసం కంపెనీ రూ. 200-250 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్లర్క్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 528కు చేరింది. ఆపై కొంత మందగించింది. ప్రస్తుతం 7.5 శాతం ఎగసి రూ. 513 వద్ద ట్రేడవుతోంది. గతేడాది షేరుకి రూ. 1500 ధరలో 1.75 మిలియన్ షేర్లను ఈక్లర్క్స్ బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 262 కోట్లను వెచ్చించింది. ఈక్లర్క్స్‌లో మార్చికల్లా ప్రమోటర్లకు 50.76 శాతం వాటా ఉంది.
శోభా లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో అమ్మకాల పరిమాణం గతేడాది క్యూ4(జనవరి-మార్చి)తో పోలిస్తే 70 శాతం జంప్‌చేసినట్లు రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు ఆన్‌లైన్ టెక్నాలజీ, సొంత వ్యాపార విధానాలు, శోభా బ్రాండుపట్ల విశ్వాసం వంటి అంశాలు దోహదం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభా షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.5 శాతం జంప్‌చేసి రూ. 236 వద్ద ట్రేడవుతోంది. గత క్యూ4లో కంపెనీ నికర లాభం సగానికిపైగా తగ్గి రూ. 51 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment