న్యూఢిల్లీ, హైదరాబాద్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులు, షోరూంలు, ఆఫీసులపై దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రావిర్యాలలో ఉన్న జెమ్స్ పార్క్‌పై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. అంతేకాక నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్ షోరూంల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే గీతాంజలి జెమ్స్ యజమాని మెహిల్‌పై ఈడీ పీఎంఎల్‌ఏ కేసును నమోదుచేసింది. పీఎన్‌బీ స్కాంలో మెహిల్‌ను నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఆయన ఇంట్లీ, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. గత దశాబ్దకాలంగా గీతాంజలి జెమ్స్ పేరుతో నీరవ్ మోదీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సూరత్, ముంబైలలో గీతాంజలి జెమ్స్ షోరూంలు ఉన్నాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్, సూరత్‌లలో నీరవ్ మోదీకి డైమాండ్ తయారీ కేంద్రాలున్నాయి. హైదరాబాద్ రావిర్యాల సెజ్‌లో ఆయనకు అప్పటి ప్రభుత్వం భూకేటాయింపులు చేసింది. అటు దేశవ్యాప్తంగా ఉన్ననీరవ్ మోదీ షోరూంలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఆయన జువెల్లరీ షోరూంలను సైతం సీజ్ చేస్తోంది. కాగ, గీతాంజలి జెమ్స్‌కు దేశవ్యాప్తంగా వీఐపీలు కస్టమర్లుగా ఉన్నారు.
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడని సంగతి తెలిసింది. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే ఆయన విదేశాలకు చెక్కేశారు. తమ బ్యాంకులో భారీ మొత్తంలో మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నాయంటూ బుధవారం పీఎన్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కుంభకోణానికి, నీరవ్ మోదీకి సంబంధమున్నట్టు ఆరోపించింది. దీంతో ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడం కోసం ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. కానీ అప్పటికే ఆయన దేశం విడిచిపారిపోయారు. ప్రస్తుతం నీరవ్‌మోదీ న్యూయార్క్‌లో ఉన్నట్టు అధికారులు ట్రేస్ చేశారు. ఈ కుంభకోణానికి పాల్పడిన ఎవరిన్నీ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని బ్యాంకు నిన్నటి సమావేశంలో హెచ్చరించింది. కుంభకోణం వెలుగులోకి రాగానే పీఎన్‌బీ షేరు భారీగా పడిపోయింది. ఈ బ్యాంకు ఇన్వెస్టర్లు దాదాపు రూ.8000 కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. మరోవైపు గీతాంజలి జెమ్స్ షేర్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. మొత్తం 12 జాతీయ బ్యాంకులను నీరవ్ ముంచినట్టు కాంగ్రెస్ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment