ఎనిమిదేళ్లలో నాలుగింతలకు హౌసింగ్ మార్కెట్: ఎడల్‌వైస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత గృహరుణ మార్కెట్లో లగ్జరీ కంటే చిన్న స్థాయి ఇళ్లకే డిమాండ్ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా రూ. 15 లక్షలలోపు రుణాలకు మంచి గిరాకీ ఉందని ఆర్థిక సేవల సంస్థ ఎడల్‌వైస్ పేర్కొంది. వచ్చే ఎనిమిదేళ్లలో దేశీయ హౌసింగ్ మార్కెట్ నాలుగు రెట్లు పెరుగుతుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నట్లు ఎడల్‌వైస్ రిటైల్ ఫైనాన్స్ ప్రెసిడెంట్ అనిల్ కొత్తూరి తెలిపారు. ప్రస్తుతం దేశీయ గృహరుణ మార్కెట్ విలువ రూ. 2.40 లక్షల కోట్లుగా ఉందని, అది వచ్చే ఏడాది రూ. 3 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఎడల్‌వైస్ రెండో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం వల్ల ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోందన్నారు. దీనికితోడు ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం కూడా గృహరుణ మార్కెట్ వృద్ధికి ఉపకరిస్తోందన్నారు.