ఎనిమిది రంగాల గ్రూప్ నీరసం!
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల గ్రూప్ ఫిబ్రవరిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం ఒకశాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి 2016 ఫిబ్రవరితో పోల్చితే 2017 ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణించడం దీనికి ప్రధాన కారణం. కాగా బొగ్గు, స్టీల్, విద్యుత్ ఉత్పత్తి బాగుండడం మొత్తం సూచీ వృద్ధిలో ముగియడానికి కారణమైంది.
ఈ ఎనిమిది రంగాలు 2015లో 0.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, 2017 జనవరిలో 3.4 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. ఇక 2016–17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ ఈ ఎనిమిది రంగాల వృద్ధిరేటు వార్షికంగా 3.4 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. 2016 ఫిబ్రవరిలో ఈ ఎనిమిది రంగాల వృద్ధిరేటు 9.4 శాతం.