కరెన్సీ కరిగిపోయింది
ఒక్క రోజులో రూ. 3 లక్షల కోట్లు మటాష్..
♦ సెన్సెక్స్ 807 పాయింట్లు డౌన్
♦ ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
♦ 24 వేల పాయింట్ల దిగువకు
♦ 807 పాయింట్ల నష్టంతో 22,952 వద్ద ముగింపు
♦ నిఫ్టీ 7,000 పాయింట్ల దిగువకు
♦ 239 పాయింట్ల నష్టంతో 6,976 వద్ద ముగింపు
♦ సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్ భగ్గుమన్న బంగారం
♦ 29 నెలల కనిష్టానికి రూపాయి
♦
♦ 800 పాయింట్లు డౌన్ సెన్సెక్స్ విలవిల
ప్రపంచ మార్కెట్లలో గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా భయాలు ఆవహించాయి. దాంతో షేర్ మార్కెట్లు నిలువునా పతనమవుతున్నాయి. ఇటు జపాన్ నుంచి అటు అమెరికా వరకూ స్టాక్ సూచీలు అడ్డూ అదుపూ లేకుండా పడిపోతున్నాయి. సెన్సెక్స్ గురువారం ఏకంగా 800 పాయింట్లు పతనమయ్యింది. దాంతో ఒక్క రోజే రూ.3 లక్షల కోట్ల పై చిలుకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది! సెన్సెక్స్ 22,952 పాయింట్ల స్థాయికి క్షీణించడం 20 నెలల తర్వాత ఇదే తొలిసారి.
ప్రధాని మోదీ ఊపుతో ఆర్జించిన లాభాలన్నింటినీ ఈ దెబ్బతో మార్కెట్ కోల్పోయింది. బీజేపీ ఎన్నికల విజయం (2014, మే 9) ముందు నాటి స్థాయిలకు భారత సూచీలు పడిపోయాయి. రూపాయి 29 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ 68.29 స్థాయికి తగ్గింది. ఈ అనిశ్చిత పరిస్థితిలో డబ్బు భద్రంగా వుంటుందనే నమ్మకంతో మైనస్ వడ్డీ రేటైనా పర్లేదంటూ అమెరికా, జపాన్ ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. పుత్తడిపై పెట్టుబడులకు పరుగులు తీస్తున్నారు. దాంతో బంగారం ధర రూ.30,000 దాటేసింది! - బిజినెస్‌లో
ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమవుతున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్లలో గత ఏడేళ్లలో లేనంత భయాలు ఆవహించాయి. దాంతో షేర్ మార్కెట్లు నిలువునా పతనమవుతున్నాయి. కరెన్సీలు ఒకదానితో మరోటి పొంతనలేకుండా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ అనిశ్చితి పరిస్థితిలో డబ్బు భద్రంగా వుంటుందనే నమ్మకంతో మైనస్ వడ్డీ రేటైనా ఫర్వాలేదు..అమెరికా, జపాన్ ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఆభరణాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినా, పుత్తడి పెట్టుబడులకు పరుగులు తీస్తున్నారు. అటు అమెరికా, యూరప్, జపాన్, చైనా కేంద్ర బ్యాంకులు ఎన్ని ఉద్దీపన ప్యాకేజీలిచ్చినా ఆర్థికాభివృద్ధి బలహీనంగానే వుండటం, క్రూడ్, కమోడిటీల పతనం కారణంగా కొన్ని దేశాలు, కంపెనీలు దివాలా అంచుకు చేరవచ్చన్న అంచనాలు, కార్పొరేట్లు నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించడం తదితర అంశాలతో ఒక్కసారిగా ఇన్వెస్టర్ల ఆందోళన మొదలయ్యింది. దాంతో జనవరిలో నెమ్మదిగా మొదలైన ఈక్విటీ షేర్ల పతనం ప్రస్తుతం పతాకస్థాయికి చేరింది.
అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళ నతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ వరుసలోనే భారత స్టాక్ మార్కెట్ కూడా భారీగా పతనమైంది. అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 23,000 పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,000 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 807 పాయింట్లు నష్టపోయి 22,952 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 239 పాయింట్లు క్షీణించి 6,976 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఒక్క రోజు పతనాల్లో ఇది ఎనిమిదో అతి పెద్ద క్షీణత. ఆరు నెలల్లో నిఫ్టీకి ఇదే అతి పెద్ద పతనం. బ్యాంక్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. రియల్టీ, విద్యుత్తు, వాహన, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు బాగా దెబ్బతిన్నాయి. అన్నిరంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
4 రోజుల్లో 1,665 పాయింట్లు నష్టం..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయి, 22,909 పాయింట్లకు పడిపోయింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,665 పాయింట్లు నష్టపోయింది. గత ఏడాది మార్చి 4న సెన్సెక్స్ 30,000 మార్క్‌ను దాటింది. ఇది సెన్సెక్స్ ఆల్ టైమ్ హై. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ ఇప్పటిదాకా 23 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆల్‌టైమ్ హై నుంచి(9,119 పాయింట్లు) చూస్తే 31 శాతం పతనమైంది. ఇది బేర్ మార్కెట్(క్షీణత కొనసాగడం)ను సూచిస్తోందని నిపుణులంటున్నారు.
‘ప్రపంచ’ ప్రభావం కొనసాగుతుంది..
స్టాక్ మార్కెట్లో అమ్మకాలు అలుపులేకుండా కొనసాగుతున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ముడి చమురు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరడం, రూపాయి పతనం, మార్జిన్ కాల్స్, క్యూ3 ఫలితాలు నిరాశగా ఉండడం,ఇవన్నీ స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలవుతున్నాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు మొండిబకాయిలకు అధిక కేటాయింపులు జరపడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ బాగా దెబ్బతిన్నదని మరో బ్రోకర్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కొనసాగుతుందని, మార్కెట్ సెంటిమెంట్‌ను అంతర్జాతీయ పరిణామాలు నిర్దేశిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు.
ప్రభుత్వం అభయమిచ్చినా ఆగని పతనం..
కాగా అంతర్జాతీయ కారణాల వల్లే స్టాక్ మార్కెట్ పడిపోతోందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయని, ప్రపంచ మార్కెట్లతో పోల్చితే భారత స్టాక్ మార్కెట్ ఒకింత నయమని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల వల్ల తలెత్తే సమస్యలను తట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అభయం ఇచ్చారు. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, అంతర్జాతీయంగా తలెత్తే ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ప్రస్తుత కల్లోలం సమసిపోగలదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఆభయం ఇచ్చారు. అయితే ఇవేవీ పనిచేయలేదు. ఇన్వెస్టర్ల అమ్మకాలకు అడ్డుకట్టవేయలేకపోయాయి.
రెండు సెన్సెక్స్ షేర్లకే లాభాలు
30 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లకు నష్టాలు వచ్చాయి. కేవలం రెండు షేర్లే లాభపడ్డాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. క్షీణించిన షేర్లవిషయానికొస్తే అదానీ పోర్ట్స్ 6.9 శాతం, భెల్ 6 శాతం, టాటా మోటార్స్ 5.5 శాతం, ఓఎన్‌జీసీ 5.2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.9 శాతం, టాటా స్టీల్ 4.5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.1 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.9 శాతం, గెయిల్ 3.8 శాతం, మారుతీ 3.8 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.7 శాతం, లుపిన్ 3.7 శాతం, ఐటీసీ 3.2 శాతం, టీసీఎస్ 3.2 శాతం, హిందూస్తాన్ యూనిలీవర్ 3.1 శాతం, విప్రో 3 శాతం చొప్పున నష్టపోయాయి. 2,369 షేర్లు నష్టపోగా, 324 షేర్లు లాభపడ్డాయి.
ఏడాది కనిష్ట స్థాయికి 400 షేర్లు..
సెన్సెక్స్ భారీ పతనం కారణంగా దాదాపు 400 షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. అదానీ పోర్ట్స్, అలహాబాద్ బ్యాంక్, భెల్, సిప్లా, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, పీఎన్‌బీ, సెయిల్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, టీసీఎస్, సుజ్లాన్ ఎనర్జీ వాటిల్లో కొన్ని.
ఎందుకీ పతనం...
జానెట్ వ్యాఖ్యలు: ఎలాంటి ప్యాకేజీ ఉండబోదని, వడ్డీరేట్లను క్రమక్రమంగా పెంచుతామని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు రిస్క్ తప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ జానెట్ యెల్లెన్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను వణికించాయి. అమ్మకాలు వెల్లువై అన్ని దేశాల మార్కెట్లూ నష్టపోయాయి.
నిరాశగా క్యూ3 ఫలితాలు..: ఇప్పటివరకూ వెలువడిన కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు ఉత్తేజాన్వివ్వలేకపోయాయి. మరోవైపు మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా బ్యాంకుల నికర లాభాలు బాగా దెబ్బతిన్నాయి.
కొనసాగుతున్న విదేశీ విక్రయాలు: భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,400 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
ముడిచమురు భారీ పతనం: ఇటీవల కాలంలో కొంతవరకూ రికవరీ అయిన ముడిచమురు ధరలు మళ్లీ పతనం కావడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
ప్రపంచ మార్కెట్ల పతనం: బుధవారం అమెరికా మార్కెట్ నష్టాల్లో ముగియడం, గురువారం ఆసియా ప్రధాన మార్కెట్లు కుదేలు కావడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగియడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి.
రూ. 3 లక్షల కోట్లు ఆవిరి
ఒక్క గురువారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట క్యాపిటలైజేషన్ 3.18 లక్షలకోట్లు ఆవిరై రూ.86,30,930 కోట్లకు తగ్గింది. ఈ వారం ప్రారంభం నుంచి చూస్తే ఆవిరైన ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. సెన్సెక్స్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఇన్వెస్టర్ల సంపద మొత్తం 20 లక్షల కోట్ల వరకూ హరించుకుపోయింది. గత ఏడాది డిసెంబర్ 31న రూ.1,00,37,734 కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.14 లక్షల కోట్లు హరించుకుపోయింది.
29 నెలల కనిష్టానికి రూపాయి
ముంబై: దేశీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు గణనీయంగా తరలిపోతున్న నేపథ్యంలో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో గురువారం రూపాయి 29 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే మరో 45 పైసలు తగ్గి.. 68.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలకు తగ్గట్లు ఊహించినట్లుగానే రూపాయి ట్రేడింగ్ ప్రతికూలంగానే మొదలైందని, రోజు గడిచే కొద్దీ మరింత బలహీనపడిందని వెరాసిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ చెప్పారు. గురువారం రోజంతా 67.90-68.34 శ్రేణిలో రూపాయి తిరుగాడింది. చివరికి 0.66 శాతం నష్టంతో 68.30 వద్ద ముగిసింది. 2013 ఆగస్టు 28న ఇంట్రాడేలో రూపాయి మారకం విలువ 68.85 కనిష్ట స్థాయిని తాకింది. ఆ రోజున చివరికి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 68.80 వద్ద ముగిసింది.
ప్రపంచ మార్కెట్లు కుదేల్
లండన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ యెలెన్ పేల్చిన మాటల తూటాలకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు 12 ఏళ్ల కనిష్టానికి పడిపోవడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదని, అయినప్పటికీ దశలవారీగా వడ్డీరేట్లను పెంచుతామని ఆమె వ్యాఖ్యానించడంతో అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు చెలరేగి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగించారు.
బుధవారం అమెరికా మార్కెట్ల పతన ప్రభావంతో అసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. న్యూయార్క్‌లో బ్యారెల్ ముడి చమురు 12 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయి 27 డాలర్ల దిగువకు పడిపోవడం, ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం రియో టింటో 86 కోట్ల డాలర్ల వార్షిక నష్టాలను ప్రకటించడం ప్రతికూల ప్రభావం చూపాయి. మరో మాంద్యం తప్పదేమోనన్న భయాలతో అమెరికా నుంచి ఆసియా దాకా ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 4% క్షీణించింది. అమ్మకాల సెగ యూరప్‌ను తాకింది. జర్మనీ డ్యాక్స్ 3%, ఫ్రాన్స్ సీఏసీ సూచీ 4%, ఇంగ్లండ్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ 2% చొప్పున నష్టపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా డోజోన్స్ 2.2%, నాస్‌డాక్ ఇండెక్స్ 1.4% నష్టాల్లో ట్రేడవుతున్నాయి.