మళ్లీ చమురు పడింది..
దశాబ్ద కనిష్టానికి తగ్గిపోయిన
ఇండియన్ బాస్కెట్ క్రూడ్ బ్యారెల్ రేటు
38.61 డాలర్లకు పడిపోయిన నెలవారీ సగటు ధర
కానీ పన్నుల కారణంగా కొనుగోలుదారులకు దక్కని ప్రయోజనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్‌కి మించి ఉత్పత్తి జరుగుతుండటంతో ముడి చమురు ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కొనుగోలు చేసే ముడిచమురు (ఇండియన్ బాస్కెట్)కి సంబంధించి నెలవారీ సగటు 38.61 డాలర్లకు తగ్గింది. ఈ రేటు స్థిరంగా కొనసాగితే 2004 తర్వాత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత కనిష్ట నెలవారీ సగటు కానుంది. 2004 డిసెంబర్‌లో ఇండియన్ బాస్కెట్ రేటు 36.85 డాలర్లుగా ఉండేది. ఆ తర్వాత నుంచి ధర 38.61 డాలర్లకు ఎగువనే కొనసాగుతోంది. గత నెల బ్యారెల్ ఇండియన్ బాస్కెట్ సగటు ధర 42.50 డాలర్లుగా నమోదైంది.
అంతర్జాతీయంగా గత కొన్నాళ్లుగా చమురు ధరలు పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ నాటి రేట్లతో పోలిస్తే ప్రస్తుతం ధరలు దాదాపు 60 శాతం మేర క్షీణించాయి. సంపన్న దేశాల్లో మందగమనం, నిల్వలు పేరుకుపోవడం ఇందుకు కారణం. సాధారణంగా నిల్వలు భారీగా పేరుకుపోయి రేట్లు పతనమవుతుంటే ఉత్పత్తిని తగ్గించాలి. కానీ చమురు ఉత్పత్తి దేశాలు తమ తమ మార్కెట్లను కాపాడుకునేందుకు ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉన్నాయి. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్)లోని 12 సభ్య దేశాలు గత నెలలో రోజుకు 31.5 మిలియన్ బ్యారెళ్ల మేర ముడిచమురు ఉత్పత్తి చేశాయి. అటు అమెరికాలో షేల్ ఆయిల్ కూడా గణనీయంగా ఉత్పత్తవుతోంది. ఈ పరిణామాల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా ఏడేళ్ల కనిష్ట స్థాయిని చవిచూసింది.
40 డాలర్ల దిగువకు బ్రెంట్: నిల్వలు పేరుకుపోతున్నప్పటికీ ఉత్పత్తిని తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలన్న ఒపెక్ దేశాల నిర్ణయంతో క్రూడ్ రేట్లు మరింతగా పతనమవుతున్నాయి. జనవరి డెలివరీకి సంబంధించిన బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ బ్యారెల్ ధర మంగళవారం తొలిసారిగా 40 డాలర్ల దిగువకు పడిపోయింది. 39.81 డాలర్ల స్థాయికి క్షీణించింది. 2009 ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయికి బ్రెంట్ రేట్లు తగ్గటం ఇదే ప్రథమం. అటు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రేటు సైతం 36.64 డాలర్ల స్థాయికి తగ్గి ట్రేడయ్యింది.
దిగిరాని పెట్రోలు, డీజిల్ రేట్లు
ముడి చమురు ధరలు పతనమైతే అంతిమంగా పెట్రోలు, డీజిలు రేట్లు కూడా తగ్గాలి. కానీ భారతీయ కొనుగోలుదారులకు ఆ ప్రయోజనాలు అంతగా దక్కడం లేదు. ప్రభుత్వం పన్నులు ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండటమే ఇందుకు కారణం. ఇక రేటు పడిపోవడమన్నది చమురు ఉత్పత్తి కంపెనీలకు కూడా ప్రతికూల విషయమే. గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేసి, రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడవు. ఇటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చమురు కంపెనీలు ఇటు పెట్టుబడులు తగ్గించుకోవడం, అటు కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టకపోవడం దీనికి నిదర్శనం. ఇదే పరిస్థితి కొనసాగితే అంతిమంగా డిమాండ్ కన్నా ఉత్పత్తి తగ్గిపోయి, రేట్లు మళ్లీ పెరుగుతాయి.
ఇండియన్ క్రూడ్ బాస్కెట్..
దేశీ రిఫైనర్లు వివిధ రకాల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. నిర్దిష్ట నిష్పత్తిలో వీటిని కలగలుపుతాయి. దీన్ని ఇండియన్ క్రూడ్ బాస్కెట్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇందులో 72:28 నిష్పత్తిలో ఒమన్, దుబాయ్ సోర్ గ్రేడ్, బ్రెంట్ స్వీట్ గ్రేడ్ క్రూడ్ ఉంటోంది. ఈ నిష్పత్తి గతంలో 58:42గా ఉండేది. కానీ స్వీట్ గ్రేడ్‌తో పోలిస్తే కఠినంగా ఉండే సోర్ గ్రేడ్ క్రూడ్‌ను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యాన్ని దేశీ రిఫైనింగ్ సంస్థలు పెంచుకోవడంతో ఈ నిష్పత్తి కూడా మారింది.