'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లకు ఇక గుడ్ బై
పెద్ద పెద్ద మెగామార్ట్‌లు, షోరూంలలో అందించే పాపులర్ ప్రమోషనల్ స్కీమ్ 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్‌కు చరమగీతం పాడే సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానంతో జీఎస్టీ నేపథ్యంలో వీటిని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ప్యాకేజ్డ్ ప్రొడక్ట్‌లు, ఫుడ్ సర్వీసు కంపెనీలు ఇప్పటికే ఈ స్కీమ్స్‌ను పక్కనపెట్టేస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం జీఎస్టీ విధానంలో ఈ ఉచితాలకు కూడా అదనంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రావడమే. కస్టమర్లకు కంపెనీలు ఏదైనా ఉచితంగా అందిస్తే, దానికి కూడా అదనంగా పన్ను చెల్లించాలి. అంతేకాక ఉచితంగా ఉత్పత్తిని అమ్ముతున్నట్టు కంపెనీలు వర్గీకరిస్తే ఇన్‌పుట్ క్రెడిట్‌ను కూడా కోల్పోతున్నారు. దీంతో కంపెనీలు కస్టమర్ల ఆకట్టుకోవడానికి ఇక విభిన్నమైన మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. బై-వన్ గెట్-వన్ ఫ్రీ ఆఫర్లను పక్కన పెట్టేసి, డిస్కౌంట్‌ను ఎక్కువగా అందిస్తున్నట్టు పార్లె ప్రొడక్ట్‌ల మార్కెటింగ్ హెడ్ మయాంక్ షా తెలిపారు. ఇది తీవ్ర అంతరాయాన్ని సృష్టిస్తుందని కూడా చెప్పారు.
గత ఎనిమిది క్వార్టర్‌లుగా కన్జ్యూమర్ గూడ్స్ మార్కెటింగ్ మంచి వృద్ధిని నమోదుచేయడం లేదు. దీంతో ఈ స్కీమ్స్‌ను ఆఫర్ చేసి వినియోగాన్ని పెంచాలని కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, కొత్త పన్ను విధానంలో వీటికి కూడా గండిపడుతోంది. డిస్కౌంట్లను ఇవ్వడానికి కంపెనీలు భిన్నమైన వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. డొమినోస్ పిజ్జా, పిజ్జా హట్‌లను నడుపుతున్న జుబిలియంట్ ఫుడ్‌వర్క్స్, యమ్ రెస్టారెంట్లు ఇప్పటికే వాటి మార్కెటింగ్ జాబితా నుంచి బై-వన్-గెట్-వన్ స్కీమ్స్‌ను తీసివేశాయి. ఏదైనా ఉచితంగా సరఫరా చేస్తే దానిపై కచ్చితంగా జీఎస్టీ చెల్లించాల్సిందేనని పన్ను నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ పాలసీ ఫార్మాస్యూటికల్ సెక్టార్ వరకు ఉందన్నారు. జీఎస్టీ యాక్ట్ ప్రకారం, ఏదైనా ఉచితంగా అమ్మితే, దాని లావాదేవీ విలువను గుర్తించబడుతుందని, దానిపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని క్లియర్ ట్యాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అర్చిత్ గుప్తా తెలిపారు. బై-వన్-గెట్-వన్ కింద ఆఫర్ చేసే ఉచితాలు ప్రతి కంపెనీ మార్కెటింగ్ విధానం. ఉచితంగా ఆఫర్ చేసే ఈ విధానంతో రివర్స్‌లో కంపెనీలకు వచ్చే ఇన్‌పుట్ క్రెడిట్‌కు అనర్హులవుతున్నారని పీడబ్ల్యూసీ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్ నేషనల్ లీడర్, పార్టనర్ ప్రతీక్ జైన్ కూడా తెలిపారు.