
సరే.. ఏప్రిల్ 2నే రండి
మనీ లాండరింగ్ కేసులో మాల్యాకు ఈడీ తాజా సమన్లు
ముంబై: మనీ లాండరింగ్ కేసులో మార్చి 18న విచారణకు హాజరు కాలేనని, ఏప్రిల్ దాకా తనకు మరింత సమయం ఇవ్వాలని వ్యాపార వేత్త విజయ్ మాల్యా చేసిన విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మన్నించింది. ఏప్రిల్ 2న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ శుక్రవారం తాజాగా సమన్లు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ) కింద జారీ అయిన సమన్ల ప్రకారం ఆయన తన వ్యక్తిగత పెట్టుబడులు, ఆర్థిక వివరాల పత్రాలు, గత ఐదేళ్ల ఆదాయ పన్ను రిటర్నులు, పాస్‌పోర్టు సమర్పించాల్సి ఉంటుంది. మాల్యాతో పాటు మహారాష్ట్ర మాజీ డిప్యుటీ సీఎం ఛగన్ భుజ్‌బల్ తదితర హై ప్రొఫైల్ కేసులన్నింటినీ ఈడీ డెరైక్టర్ కర్నల్ సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అటు విచారణలో ఆర్‌బీఐ, సెబీ సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు వివరించాయి. దాదాపు రూ. 9,000 కోట్ల మేర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు మాల్యా, యూబీ గ్రూపు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం, పలు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టడం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకు నుంచి పొందిన రూ. 900 కోట్ల రుణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసును పెట్టి, దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించే మాల్యా మార్చి 18న (శుక్రవారం) విచారణకు రావాల్సి ఉండగా, తనకు మరింత సమయం ఇవ్వాలంటూ ఈడీకి పంపిన ఈమెయిల్‌లో అభ్యర్ధించారు.
కంపెనీలు కట్టకుంటే.. గ్యారంటార్ల ఆస్తులు అమ్మండి
మాల్యా కంపెనీల రుణాల ఎగవేత తరహా కేసుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తీసుకున్న రుణాలను కంపెనీలు తిరిగి చెల్లించని పక్షంలో పూచీకత్తునిచ్చిన ప్రమోటర్ డెరైక్టర్ల వ్యక్తిగత ఆస్తులను విక్రయించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. రుణాల డిఫాల్ట్‌కి సంబంధించి చాలా సందర్భాల్లో బ్యాంకులు గ్యారంటార్ల నుంచి రికవరీ చేసుకోవడంపై దృష్టి పెట్టకపోవడం జరుగుతోందని, ఇది సరికాదని పేర్కొంది. కంపెనీల నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు (డీఆర్‌టీ) వెళ్లాలని, ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ చట్టం.. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ తదితర చట్టాల కింద గ్యారంటార్లపైనా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండి బకాయిలు రూ. 3.61 లక్షల కోట్లకు ఎగిసిన సంగతి తెలిసిందే.