
ఇప్పుడు రాను.. ఏప్రిల్ లో వస్తా!
మనీలాండరింగ్ కేసులో ఈడీకి తెలిపిన మాల్యా
ముంబై/న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో నేడు (శుక్రవారం) విచారణకు తాను హాజరు కాబోవడం లేదని రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)కి తెలియజేశారు. హాజరయ్యేందుకు తనకు ఏప్రిల్ దాకా సమయం ఇవ్వాలని కోరారు. విచారణకు రాకపోవడానికి మాల్యా చూపిన కారణాలను పరిశీలిస్తున్నామని, ఆయనకు మరింత సమయం ఇవ్వాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని ఈడీ పేర్కొంది.
దాదాపు రూ. 9,000 కోట్ల మేర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు మాల్యా, యూబీ గ్రూపు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం, పలు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకు నుంచి పొందిన రూ. 900 కోట్ల రుణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 18న స్వయంగా విచారణకు హాజరు కావాలని మాల్యాను ఆదేశించింది. అయితే, మార్చి 2నే దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా.. నిర్దేశిత తేదీన తాను రాలేనంటూ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌కు తెలిపారు.
మాల్యా ఆస్తులు.. వేలంలో కొనేవారే కరువు ..
రుణాల రికవరీ కోసం ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను బ్యాంకులు గురువారం వేలానికి ఉంచగా.. స్పందనే కరువైంది. ఉదయం 11.30 గం.లకు ప్రారంభమైన వేలం .. ఒక్క బిడ్డూ దాఖలు కాకపోవడంతో గంటలోనే ముగిసింది. విలే పార్లే ప్రాంతంలో దాదాపు 17,000 చ. అ. విస్తీర్ణంతో ఈ భవంతి ఉంది. ఎస్‌బీఐక్యాప్స్ ట్రస్టీ నిర్వహించిన వేలంలో ఈ ప్రాపర్టీకి రిజర్వ్ ధరను రూ. 150 కోట్లుగా నిర్ణయించాయి బ్యాంకులు. అయితే, ఒకవైపు లిటిగేషన్ భయాలు మరోవైపు ధర అధికమన్న కారణాలతో ఎవరూ బిడ్ చేయడానికి ముందుకు రాలేదు. ఈ ప్రాపర్టీకి ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ దాదాపు రూ.40-50 కోట్ల విలువను సిఫార్సు చేసినప్పటికీ.. బ్యాంకులు దాన్ని పక్కన పెట్టి రూ. 150 కోట్ల రిజర్వ్ ధరకు మొగ్గు చూపాయి. ప్రాపర్టీ ఉన్న ప్రాంతాన్ని, మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే బ్యాంకులు చాలా ఎక్కువగానే రేటు పెట్టాయని రియల్టీ కన్సల్టెంట్లు పేర్కొన్నారు. తాజా పరిణామంతో.. వేలం వైఫల్యానికి కారణాలను సమీక్షించేందుకు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాం కుల కన్సార్షియం మార్చి 19న సమావేశం కానున్నట్లు సం బంధిత వర్గాలు చెప్పాయి. రేటును రూ.100-120 కోట్లకు కుదించే అవకాశాలను పరిశీలించవచ్చని వివరించాయి.
యూబీ బోర్డు నుంచి వైదొలగాలి: హైనెకెన్
యునెటైడ్ బ్రూవరీస్ బోర్డు నుంచి కూడా వైదొలగాలని హైనెకెన్ సంస్థ మాల్యాను కోరే అవకాశం ఉందని సమాచారం. అలా కుదరని పక్షంలో ఆయన్ను తొలగించడంపై ఓటింగ్ కోసం షేర్ హోల్డర్ల సమావేశం నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. యునెటైడ్ బ్రూవరీస్‌లో హైనెకెన్‌కు ప్రస్తుతం 42.4 శాతం వాటాలు ఉన్నాయి. మాల్యా ఇటీవలే యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రతీ పైసా రాబడతాం: ఆర్థిక మంత్రి జైట్లీ
మాల్యా సంస్థలు తీసుకున్న రూ. 9,000 కోట్లలో బ్యాంకులు ప్రతీ పైసాను రాబడతాయని గురువారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మాల్యా ఏయే చట్టాలను ఉల్లంఘించారో వాటన్నింటి విషయంలోను.. వివిధ ప్రభుత్వ విభాగాలు, దర్యాప్తు ఏజెన్సీలు తగు చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు.