మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మూడోసారి సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మూడోసారి సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వాస్తవానికి ఆయన శనివారమే ముంబైలోని ఈడీ జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మే దాకా సమయం ఇవ్వాలంటూ శుక్రవారం కోరారు.
అయితే, తాజాగా ఈ నెల 9న రావాలంటూ ఈడీ ఆదేశించింది. సాంకేతిక, చట్టపర కారణాలతో విచారణ అధికారి (ఐవో) ఇప్పటిదాకా పలు వాయిదాలకు సమ్మతించారని, కానీ ఇవే ఆఖరు సమన్లు కాగలవని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 535 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు సర్వీస్ ట్యాక్స్ విభాగం త్వరలోనే మాల్యా విమానాన్ని వేలం వేయనుందని అధికారులు తెలిపారు.