
మాల్యా చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు
న్యూఢిల్లీ/ముంబై: రుణ ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగుసుకుంటోంది. మనీ లాండరింగ్ అభియోగాలతో నమోదు చేసిన కేసును మరింత పటిష్టంగా మార్చేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన 17 బ్యాంకులతో పాటు వివిధ విచారణ ఏజెన్సీలకు లేఖలు రాసింది. గతంలో నిర్వహించిన విచారణ వివరాలు అందించాలంటూ ఆదాయ పన్ను విభాగం, సేవా పన్ను విభాగంతో పాటు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) మొదలైన వాటిని కోరింది. మార్చి 18న ముంబైలో జరిపే విచారణకు మాల్యా హాజరు కాకపోయినా, సహేతుకమైన కారణాలు చూపలేకపోయినా.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈడీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంకు రూ. 900 కోట్లు రుణం ఇవ్వడాన్ని, ఇందులో మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ విచారణ చేస్తోంది.
డిఫాల్టర్లపై సెబీ కొత్త నిబంధనల ప్రభావంతో బేయర్‌లో మాల్యా బోర్డు పదవికి ఎసరు
ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో కొనసాగకుండా సెబీ నిషేధం విధించడం మాల్యాకు చిక్కులు తెచ్చిపెట్టనుంది. ప్రస్తుతం ఆయన బేయర్ క్రాప్‌సెన్సైస్, సనోఫీ ఇండియా, మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, యునెటైడ్ బ్రూవరీస్, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తదితర సంస్థల బోర్డుల్లో ఉన్నారు. సెబీ తాజా ఆదేశాలు అమల్లోకి వస్తే.. ఉద్దేశపూర్వక ఎగవేతదారు అభియోగాలు ఎదుర్కొంటున్నందున మాల్యా.. వీటన్నింటి బోర్డుల నుంచి వైదొలగాల్సి రానుంది.
ఆ ప్రకటనలు నేనివ్వనే లేదు: మాల్యా
భారత్ తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని ఒక ఇంటర్వ్యూలో తానన్నట్లు వచ్చిన వార్తలను మాల్యా ఖండించారు. తాను ఇంటర్వ్యూ ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలు షాక్‌కు గురి చేశాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. తానెవ్వరికీ ఎటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వలేదని, వాస్తవాలను ధృవీకరించుకోకుండా రాసేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు, మాల్యా ఇంటర్వ్యూ ప్రచురించిన సండే గార్డియన్ పత్రిక తమ కథనానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్వ్యూకు దారి తీసిన ఈమెయిల్స్‌ను వెల్లడించనున్నట్లు ట్వీట్ చేసింది.