
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ సంస్థ గూగుల్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ తాజాగా ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. జూన్‌లో ఆయన తప్పుకోనున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. గతేడాది తొలినాళ్లలోనే ఆల్ఫాబెట్ చైర్మన్ పదవి నుంచి ష్మిట్ తప్పుకున్నారు. ఆతర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పటికీ .. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితమయ్యారు. జూన్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది.
అటుపైన రీ–ఎలక్షన్ కోరరాదని ష్మిట్ నిర్ణయించుకున్నారని, సాంకేతికాంశాల్లో తగు సలహాలు ఇవ్వడం కొనసాగిస్తారని ఆల్ఫాబెట్ పేర్కొంది. ప్రముఖ వ్యాపారవేత్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ష్మిట్‌ను సీఈవోగా 2001లో గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ రిక్రూట్ చేశారు. అప్పటికి గూగుల్ ప్రారంభమై మూడేళ్లే అయింది. ఆ తర్వాత నుంచి సంస్థను భారీగా విస్తరించటంలో పేజ్, బ్రిన్‌లతో పాటు ష్మిట్ కీలక పాత్ర పోషించారు. 2001 నుంచి 2011 దాకా గూగుల్ సీఈవోగా వ్యవహరించారు. తర్వాత ష్మిట్ స్థానంలో పేజ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అటుపై గూగుల్‌కు ఆల్ఫాబెట్ పేరుతో కొత్తగా మాతృ సంస్థను ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ సీఈవోగా పేజ్, గూగుల్ సీఈవోగా ప్రవాస భారతీయులు సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment