విమాన టిక్కెట్లకూ ఈఎంఐ ఆప్షన్
దుబాయ్ : ఈఎంఐ ఆప్షన్ ఇన్ని రోజులు నిత్య వాడుకలో మనం కొనుగోలు చేసే ఉత్పత్తులకు మాత్రమే చూసేవాళ్లం. కానీ తాజాగా విమాన టిక్కెట్లకు ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. యూఏఈ విమానయాన సంస్థ ఇతిహాద్ ఎయిర్‌వేస్ 'ప్లై నౌ అండ్ పే లేటర్' స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లలో టిక్కెట్ ఛార్జీలను చెల్లించుకునే ఆప్షన్‌ను ఈ విమానయాన సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కుటుంబ సభ్యులు తమ విమాన టిక్కెట్లను వారి సౌలభ్యం మేరకు బుక్ చేసుకోవచ్చని, అవసరాలకు అనుగుణంగా చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవచ్చని ఇతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది. పేఫోర్ట్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న అనంతరం గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా ఆటోమేటెడ్ ఆన్‌లైన్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఇతిహాద్ పేరులోకి వచ్చింది. అరబ్ వరల్డ్‌లో పేపోర్టు, దిగ్గజ పేమెంట్ సర్వీసు ప్రొవైడర్.
ఈ స్కీమ్‌ను పొందడం కోసం ప్రయాణికులు ఇతిహాద్ విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో 'పే బై ఇన్‌స్టాల్‌మెంట్' ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం తమ దగ్గర క్రెడిట్ కార్డుంటే బ్యాంకును ఎంపికచేసుకుని, చెల్లింపు కాలాన్ని నమోదుచేయాలి. మూడు నెలల నుంచి 60 నెలల వరకు చెల్లింపు ఇన్‌స్టాల్‌మెంట్లను ఎంచుకోవచ్చు. 17 బ్యాంకుల కస్టమర్లకు అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రయాణం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తమకు తెలుసని, ముఖ్యంగా కుటుంబసభ్యులకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఎయిర్‌లైన్ డిజిటల్ స్ట్రాటజీ, ఇన్నోవేసన్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్‌బై చెప్పారు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే దిగులు అవసరం లేకుండా.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇదొక గొప్ప మార్గమని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ను డిజైన్ చేసేముందు తక్కువ, మధ్య తరగతి ప్రయాణికులను, కుటుంబ సభ్యులను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది.