ఫైనాన్షియల్ బేసిక్స్...
క్రెడిట్ కార్డు.. ఈఎంఐ ఆప్షన్..
క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వీటిని కోరుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేనప్పుడు అత్యవసర ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అందుకే వీటికి ఆదరణ పెరిగిపోతోంది. చాలా మంది క్రెడిట్ కార్డుతో పెద్ద మొత్తంలో వస్తు కొనుగోలు జరిపి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. మనం ఎలాగైతే రుణం తీసుకొని వడ్డీ, అసలు చెల్లించి రుణాన్ని తీర్చుకుంటామో.. క్రెడిట్ కార్డు ఈఎంఐ కూడా అలాగే పనిచేస్తుంది.
ఇక్కడ అసలు, వడ్డీ రెండూ చెల్లిస్తాం. చెల్లించే ఈ వడ్డీ క్రెడిట్ కార్డు కంపెనీకి ఆదాయం అవుతుంది. అలాగే నిర్ణీత గడువులోగా కార్డు బిల్లులను చెల్లించకపోతే మనకు పెనాల్టీ రూపంలో మళ్లీ వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ కూడా క్రెడిట్ కార్డు కంపెనీలకు రాబడి అవుతుంది. మనం సరైన సమయంలోనే బిల్లులు చెల్లిస్తే పర్వాలేదు. ఆలస్యంగా చెల్లిస్తే మాత్రం ఆయా కంపెనీల రాబడికి మన వాటా జమవుతుంది. అన్ని క్రెడిట్ కార్డులకు ఈఎంఐ సౌలభ్యం ఉండకపోవచ్చు. ఇక కొనుగోలు మొత్తాన్ని ఈఎంఐకి మార్చుకోవాలని భావిస్తే.. ముందుగా వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోండి.