సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్‌లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు.. ఇలా ప్రతీ ఒక్కటీ తెలిస్తే నెలవారీ బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. గడువు తేదీ తర్వాత చెల్లిస్తే మాత్రం అధిక వడ్డీ రేట్లు, అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. కనుక కుదిరితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించటమే ఉత్తమం. పెద్ద మొత్తంలోని బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఈఎంఐ విధానాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డును మెరుగ్గా నిర్వహించే మార్గాలను చూద్దాం..
ఈఎంఐ ఆప్షన్..
నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, ఈ తర్వాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ రహిత కాల వ్యవధిని రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించకపోతే మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి (ఈఎంఐ) సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది.
నో కాస్ట్ ఈఎంఐతో లాభమే..
‘నో కాస్ట్ ఈఎంఐ’.. ‘రూపాయి చెల్లించి నచ్చిన ఉత్పత్తిని ఇంటికి తీసుకెళ్లండి.. ఆ తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్‌లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్‌టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.
ఈఎంఐ ఆఫర్లు..
రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ పోర్టళ్లు క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై ఈఎంఐలను ఆఫర్ చేస్తాయి. తయారీదారులు/వ్యాపారుల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా.. ఈఎంఐ వడ్డీ రేట్లు, కాల వ్యవధులు నిర్ణయించడం జరుగుతుంది. ఆఫర్లలో భాగంగా ఆయా సంస్థలు ప్రకటించే ఈఎంఐ వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వడ్డీ రేట్లతో పోలిస్తే తక్కువగానే ఉండ డం ఆకర్షణీయం. అందుకే భారీ కొనుగోళ్లకు ముందుగా.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ కంపెనీల ఈఎంఐ ఆఫర్లను తనిఖీ చేయాలి. పైగా ఈ ఆఫర్లకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు.
క్రెడిట్ కార్డులపై రుణాలు..
మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డులపై రుణాల జారీ వేగంగా ఉంటుంది. వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ కంటే ఎక్కువ ఉండవని పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా తెలిపారు.
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? వడ్డీ భారం పడకుండా ఇలా చేయండి
Published Mon, Apr 5 2021 5:31 AM | Last Updated on Mon, Apr 5 2021 11:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment