విమాన ప్రయాణానికీ.. ఈఎంఐ ఆప్షన్..
జెట్ ఎయిర్‌వేస్ వినూత్న సేవలు
న్యూఢిల్లీ: కార్లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్లే కాదు.. ఇప్పుడు విమాన టికెట్‌ను కూడా ఈఎంఐ ఆప్షన్‌లో పొందొచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ తాజాగా విమాన ప్రయాణానికి ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ దీనికోసం పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో జరిగే లావాదేవీలు పెరుగుతున్నాయి.
అందుకే ప్రయాణికులకు మేం కూడా ఈఎంఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ అధికారి జయరాజ్ వివరించారు. సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో విమాన టికెట్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో యాక్సిస్, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, కొటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులను కలిగిన వారికి ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈఎంఐ చెల్లింపుల గడువు 3, 6, 9, 12 నెలలుగా ఉంటుందని పేర్కొన్నారు.