గూగుల్‌కు రికార్డ్ స్థాయిలో భారీ జరిమానా
బ్రస్సెల్స్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజీన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్ స్థాయిలో పెనాల్టీ విధించింది. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై ఈయూ సుదీర్ఘ విచారణ నిర్వహిణ అనంతరం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ ఆ సంస్థకి ఏకంగా 2.4 బిలియన్ యూరోల (2.72 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. గూగుల్ తమ సెర్చింజన్‌లో చూపించిన ఆన్‌లైన్ షాపింగ్ సర్వీస్ సంస్థల పేర్లు ఇతర సంస్థలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని తేల్చింది.
గూగుల్ సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీస్‌లనే ప్రమోట్ చేసి.. ప్రత్యర్థి కంపెనీల డీమోట్ చేసిందన్న ఆరోపణలు గూగుల్‌పై ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ యాంటీట్రస్ట్ విభాగం.. గూగుల్‌కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17,590 కోట్లు) జరిమానా విధించింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీస్‌లకు ఫేవర్ చేయడాన్ని నిలిపేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వచ్చే టర్నోవర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామని కూడా హెచ్చరించింది.
ఏడేళ్లుగా దీనిపై విచారణ చేస్తున్న కమిషన్ ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చేసింది చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. గూగుల్ చట్ట విరుద్ధమైన చర్య వల్ల యురోపియన్ యూనియన్ కన్జూమర్లు సరైన ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కోల్పోయారని కమిషన్ స్పష్టంచేసింది. అలాగే తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏడేళ్లుగా గూగుల్‌పై పదుల సంఖ్యలో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈయూలో యాంటీట్రస్ట్ కేసులో అతిపెద్ద జరిమానాను ఎదుర్కొన్న కంపెనీగా గూగుల్ నిలిచింది. 2009లో అమెరికా చిప్ మేకర్ ఇంటెల్ కు 1.06 బిలియన్ యూరోల జరిమానా విధించింది.