ఏటా 50 చిన్న విమానాశ్రయాల అభివృద్ధి | expansion flight services in ts and ap Ashok gajapatiraju | Sakshi
Sakshi News home page

ఏటా 50 చిన్న విమానాశ్రయాల అభివృద్ధి

Published Thu, Mar 17 2016 12:38 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM

ఏటా 50 చిన్న విమానాశ్రయాల అభివృద్ధి - Sakshi

ఏటా 50 చిన్న విమానాశ్రయాల అభివృద్ధి

ప్రాంతీయ విమాన సేవల విస్తరణపై దృష్టి
ఎంఆర్‌వో యూనిట్లకు పన్ను రాయితీలు
రాబోయే నెలల్లో కొత్త పౌర విమానయాన పాలసీ
14 కొత్త విమానాలు అద్దెకు తీసుకుంటున్న
ఎయిరిండియా; 2019 కల్లా లాభాల్లోకి...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలో నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లను సంవత్సరానికి 50 చొప్పున వినియోగంలోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 140 కోట్ల మంది జనాభాకు 75 విమానాశ్రయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. దేశంలో ప్రాంతీయ విమాన సేవలను మరింత ప్రోత్సహించేలా రానున్న నెలల్లో కొత్త పౌర విమానయాన పాలసీని ప్రకటించనున్నట్లు ఆయన తెలియజేశారు. బుధవారమిక్కడ ప్రారంభమైన ‘5వ ఇండియా ఏవియేషన్ 2016’ ప్రదర్శన వివరాలను విలేకరులకు తెలియజేశారు.

‘‘దేశంలో 35 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలకు విమానాల్లో ప్రయాణించే ఆర్థిక స్తోమత ఉంది. కానీ 7 కోట్ల మంది మాత్రమే ఐదేళ్లకోసారి విమానయానం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే విమానాశ్రయాలు నగరాలకు దూరంగా  ఉన్నాయి. విమానాశ్రయాలకు వెళ్ళి రావడానికే ఐదారు గంటల సమయం పట్టేస్తోంది. పెపైచ్చు టికెట్ల ధరలూ ఎక్కువే. 500 కిలోమీటర్ల లోపు దూరాలకు గరిష్ట టికెట్ ధర రూ. 2,500 నిర్ణయించి, చిన్న విమానాశ్రయాల నుంచి సర్వీసులు నడిపే ప్రాంతీయ విమాన కంపెనీలకు పన్ను మినహాయింపు ప్రోత్సాహకాలు ఇస్తాం’’ అని అశోక గజపతిరాజు వివరించారు. వచ్చే మూడేళ్లలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో ఐదు రెట్ల వృద్ధి నమోదు చేయాలన్నది తమ ప్రధాన లక్ష్యమన్నారు. కొత్త పాలసీలో ప్రస్తుతం విదేశీ సర్వీసులు ప్రారంభించడానికున్న 5/20 (ఐదేళ్ల సర్వీసు, 20 విమానాలు) నిబంధనను తొలగించే అవకాశం ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశారు.

 2019లో లాభాల్లోకి ఎయిరిండియా..
భారీ అప్పులున్నప్పటికీ ఎయిరిండియా గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్ చౌబే చెప్పారు. 2020 నాటికి సంస్థను లాభాల్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ఏడాదిన్నర ముందే లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారాయన. గత డిసెంబర్ నుంచి ప్రతి నెలా నిర్వహణా లాభాలను నమోదు చేస్తోందని, 2019 నాటికి నష్టాలన్నీ పోయి నికరలాభాల్లోకి అడుగు పెడుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కొత్త విమాన సర్వీసులు ప్రారంభించడం, ఇంధన ధరలు తగ్గడం వల్ల లాభాల్లోకి వస్తామన్నారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో 14 ఎయిర్‌బస్ ఏ320 విమానాలను లీజుకు తీసుకునేలా కువైట్‌కు చెందిన ఏఎల్‌ఏఎఫ్‌సీవోతో ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై ఎయిరిండియా సీఎండీ అశ్వని లొహాని, ఏఎల్‌ఏఎఫ్‌సీవో సీఈవో అహ్మద్ ఆల్‌జబిన్ సంతకాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement