రిటర్న్ టికెట్ రద్దు.. నిషేధం
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమానయాన సంస్థల చర్యలు
⇒ తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధిత జాబితాలో పేరు
⇒ ఎయిరిండియా సహా ఏడు విమానయాన సంస్థల నిర్ణయం
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమానయాన సంస్థలు చర్యలకు దిగాయి. తమ విమానాల్లో రవీంద్ర ప్రయాణించకుండా విమానయాన సంస్థలు ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ఏషియా, విస్తారా నిర్ణయం తీసుకున్నాయి. పుణేకు గైక్వాడ్ బుక్ చేసుకున్న రిటర్న్ టికెట్‌ను ఎయిరిండియా, ఇండిగో రద్దు చేశాయి. దీంతో ఆయన శుక్రవారం రైలులో ముంబైకు బయల్దేరి వెళ్లారు.
విమానంలో తనకు బిజినెస్ క్లాస్ టికెట్ కేటాయించలేదంటూ గైక్వాడ్ ఎయిరిండియాకు చెందిన ఉద్యోగిపై 25సార్లు చెప్పుతో కొట్టి, దాడి చేయడం వివాదమవడం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) తమ నెట్‌వర్క్ పరిధిలోని విమానాల్లో గైక్వాడ్ ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ ఎఫ్‌ఐఏలో జెట్‌ఎయిర్‌వేస్‌తో పాటు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సభ్యులుగా ఉన్నాయి. ఎయిరిండియా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి పుణేకు ఆయన బుక్ చేసుకున్న రిటర్న్ టికెట్‌ను రద్దు చేసింది. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించే వారు ప్రయాణించకుండా నిషేధిత జాబితాను రూపొందిస్తామని ఎయిరిండియా తెలిపింది. కాగా, నిషేధిత జాబితా రూపొందిస్తామన్న ఎయిరిండియా ప్రకటనకు తాము మద్దతిస్తామని ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్, స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్‌సింగ్ చెప్పారు.
చర్యలు తీసుకుంటాం: అశోక్‌గజపతి రాజు
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, గైక్వాడ్‌పై చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారు. కాగా, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించే అవకాశం లేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ అన్నారు. శివసేన ఈ ఘటనపై గైక్వాడ్ నుంచి వివరణ కోరింది.
చట్టం ఒప్పుకోదు: కేంద్రం
గైక్వాడ్ ప్రయాణించకుండా పలు దేశీయ విమాన సంస్థలు నిషేధం విధించినా ఇది చట్ట ప్రకారం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. వ్యక్తి నేరం చేస్తే అతన్ని శిక్షించాలిగానీ విమానాలెక్కకుండా ఆపే చట్టమేదీ లేదని న్యాయ శాఖ సహాయ మంత్రి చెప్పారు. విమానయాన సంస్థల నిర్ణయం చట్టబద్ధతను పరిశీలించాల్సి ఉందన్నారు.
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: గైక్వాడ్
విమానంలో తన చర్యను గైక్వాడ్ సమర్థించుకున్నారు. ఘటనకు ఎయిరిండియా ఉద్యోగే కారణమని, ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జరిగిన దానికి తాను ఏమాత్రం చింతించడం లేదని, అతనే (ఎయిరిండియా ఉద్యోగి) వచ్చి నాకు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాత ఏం చేయాలో తాను ఆలోచిస్తానని చెప్పారు. ఈ అంశంపై తాను లోక్‌సభ స్పీకర్‌కు, పౌర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాస్తానని చెప్పారు.