గైక్వాడ్‌కు మళ్లీ విమానయోగం
నిషేధం ఎత్తివేసిన ఎయిర్ ఇండియా
► పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నిర్ణయం
న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రైవేటు విమానయాన సంస్థలు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకొంటాయని భావిస్తున్నామన్నారు. ఘటనపై గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. గత నెల 23న ఎయిర్ ఇండియా సీనియర్ అధికారిని గైక్వాడ్ చెప్పుతో 25సార్లు కొట్టారు. దీనికి నిరసనగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు విమానంలో ఆయన ప్రయాణించడాన్ని గతంలో నిషేధించాయి.
బేషరతు క్షమాపణ చెబితేనే...
మరోవైపు... విమాన అధికారిపై చేయిచేసుకున్న ఎంపీ గైక్వాడ్ బేషరుతుగా క్షమాపణ చెప్పే వరకూ ఆయన్ని విమానంలో ప్రయాణించబోనివ్వమని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనికి సంఘం లేఖ రాసింది. క్షమాపణ చెప్పకుండా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేస్తే అది సంస్థ ఉద్యోగులతో పాటు భారతీయుల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని సంఘం లేఖలో పేర్కొంది. దీంతోపాటు ఏఐకి చెందిన ‘ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ గైక్వాడ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ఆయన్ను విమానాల్లో తిరగనివ్వమని హెచ్చరించింది.
ఉపసంహరించుకోండి...
గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రిత్వ శాఖ ప్రైవేటు విమాన సంస్థలను కోరింది. అయితే దీనిపై ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్’ (ఎఫ్‌ఐఏ) అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఎఫ్‌ఐఏ నుంచి ఎలాంటి సమాచారం అందనంతవరకూ ఎంపీపై నిషేధం కొనసాగుతుందని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి చెప్పారు. ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ గైక్వాడ్ శుక్రవారం రైలులో ముంబైకి పయనమయ్యారు. నిషేధానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గైక్వాడ్‌కు చేరకపోవటంతో రైల్లో వెళ్తున్నారని ఎంపీ సన్నిహితులు తెలిపారు.