ఆ దురుసు ఎంపీ నిషేధంపై కీలక అడుగు?
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసి.. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం తన వాదనను పార్లమెంటులో వినిపించారు. ఈ వ్యవహారంలో తాను పార్లమెంటుకు క్షమాపణ చెప్తాను కానీ, ఎయిరిండియా ఉద్యోగికి కాదని చెప్పుకొచ్చారు. ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు లోక్‌సభలో హల్‌చల్ చేశారు. విమానాయాన మంత్రి అశోక్ గజపతిరాజును ఘెరావ్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విమానాయాన సంస్థలను ప్రభుత్వ వర్గాలు ఒప్పించే అవకాశముందని, సాయంత్రంలోగా ఆయనపై ఎయిర్‌లైన్స్ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చునని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో ఈ మేరకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన అల్టిమేటం జారీచేసింది.
గత నెల పుణె నుంచి ఢిల్లీ ప్రయాణించిన సందర్భంలో 60 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఆయన పలుసార్లు టికెట్ బుక్ చేసుకున్నా.. వాటిని రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే.