పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసి.. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఎయిరిండియా సిబ్బందిపై అనుచితంగా దాడి చేసిన ఘటనలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గురువారం కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాశారు. దీంతో పాటు పార్లమెంట్ లో దాడి ఘటనపై కూడా తన లేఖలో ప్రస్తావించారు.
కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి వ్యవహారంపై ఆయన ఇవాళ పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు. తాను ఎయిరిండియాకు కాదని, పార్లమెంట్‌కు క్షమాపణ చెబుతానని అన్నారు. మరోవైపు ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు లోక్‌సభలో హల్‌చల్ చేసి విమానాయాన మంత్రి అశోక్ గజపతిరాజును ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా గత నెల పుణె నుంచి ఢిల్లీ ప్రయాణించిన సందర్భంలో 60 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఆయన పలుసార్లు టికెట్ బుక్ చేసుకున్నా.. వాటిని రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే దాడిపై పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ రాయడంతో దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చని సమాచారం. మరోవైపు ఏప్రిల్ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది.