ఆయనకు స్పైస్‌జెట్ కూడా షాకిచ్చింది!
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు మరోసారి చేదు అనుభవం.. ఇప్పటికే ఐదుసార్లు విమానం ఎక్కేందుకు ప్రయత్నించి భంగపడిన గైక్వాడ్ తాజాగా ప్రైవేటు విమానంలోనూ తిరస్కారానికి గురయ్యారు.
ఈసారి ఆయన ప్రైవేటు విమానాయాన సంస్థ స్పైస్‌జెట్‌లో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. తక్కువ ధరకు అందుబాటులో ఉండే స్పైస్‌జెట్‌లో సోమవారం పుణె నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారు. శనివారం రూ. 4,504 ధర కలిగిన టికెట్‌ను కొనేందుకు ఆయన ప్రయత్నించగా.. ప్రయాణికుడి పేరును 'రవీంద్ర గైక్వాడ్' అని చెప్పడంతోనే స్పైస్‌జెట్ వెంటనే టికెట్ బుకింగ్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.
తన విమానంలో 60 ఏళ్ల మేనేజర్‌పై దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన గైక్వాడ్‌కు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియా ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది. ఎంపీ గైక్వాడ్ ఐదుసార్లు ఎయిరిండియా టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నించగా.. అన్నిసార్లు నిరాకరించింది. విమానంలో ప్రయాణించేందుకు అనుమతించకపోవడంతో ఆయన ఇప్పటికే రైలులో, కారులో ప్రయాణాలు చేస్తున్న సంగతి తెలిసిందే.