క్షమాపణ చెప్పినా మళ్లీ చేదు అనుభవం..!
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దాడి కేసులో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కాస్త వెనక్కి తగ్గి క్షమాపణ కోరుతూ లేఖ ఇచ్చినా మరోసారి ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. పశ్చాత్తాపం వ్యక్తం చేసినా ఎయిరిండియా ఆయనకు విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించలేక పోవడం గమనార్హం. తాజాగా ఆయనకు సంబంధించి రెండు విమాన ప్రయాణాల టికెట్లను విమాన సంస్థ రద్దు చేసింది. ఎంపీ గైక్వాడ్ ఇటీవల బుక్ చేసుకున్న ఏప్రిల్ 17, 24 తేదీలలో ఢిల్లీ-ముంబై ప్రయాణం, ముంబై-ఢిల్లీ జర్నీల టికెట్లను తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణంలో నిషేధం ఉన్న గైక్వాడ్.. చార్టెడ్ ప్లైయిట్ లో నిన్న (గురువారం) ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.
మరోవైపు తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని లోక్ సభలో గురువారం ఎంపీ గైక్వాడ్ డిమాండ్ చేశారు. నీ హోదా ఏంటని ఉద్యోగిని అడిగితే.. ఎయిరిండియా కా బాప్ అని ఎయిర్ ఇండియా సిబ్బంది బదులిచ్చాడని.. తాను ఓ ఎంపీని అని చెబుతుండగానే.. నువ్వేమైనా నరేంద్ర మోదీవా అని నన్నే తిరిగి ప్రశ్నించి తోసేసినట్లు తెలిపారు. దీంతో ఆవేశానికి లోనై తాను కూడా అతడిని తోసేశానని అంతేగానీ ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి చర్యలకు దిగలేదని వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై విచారణలోనే వాస్తవాలు తేలుతాయని.. అయితే విమాన ప్రయాణంలో నిషేధం వల్ల తన బాధ్యతలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
మా ఉద్యోగికి క్షమాపణ చెబితేనే అనుమతి
ఎంపీ గైక్వాడ్ విమానంలో ప్రయాణిస్తే సిబ్బందితో పాటు ప్రయాణికులకు హానికర పరిస్థితులు తలెత్తుతాయని ఎయిర్ ఇండియా సిబ్బంది సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 60 ఏళ్ల తమ సిబ్బందిపై దాడికిగానూ ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సిబ్బంది కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వణి లోహాణికి లేఖ రాశారు. పౌరవిమానయానశాఖ మంత్రిగానీ, పార్లమెంట్ గానీ ఆయనపై నిషేధం ఎత్తివేస్తే అది ఉద్యోగుల నైతిక విలువలను దిగజార్చడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై మంత్రికి క్షమాపణ చెప్పారని.. అయితే బాధిత సిబ్బందికి క్షమాపణ చెప్పక పోవడంపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Copy of Shiv Sena MP Ravindra Gaikwad's Air India ticket which was cancelled by the Airlines. pic.twitter.com/qdluTZsOHk
— ANI (@ANI_news) 7 April 2017