రూపాయి పతనం కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగటివ్‌’ | Falling rupee credit negative for India Inc, impact to be limited: Moody's | Sakshi
Sakshi News home page

రూపాయి పతనం కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగటివ్‌’

Published Tue, Sep 11 2018 12:40 AM | Last Updated on Tue, Sep 11 2018 12:40 AM

Falling rupee credit negative for India Inc, impact to be limited: Moody's - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి అదే పనిగా విలువను కోల్పోతుండటంతో... రూపాయల్లో ఆదాయం గడిస్తూ, అదే సమయంలో డాలర్ల రూపంలో రుణాలను తీసుకున్న కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగటివ్‌’(రుణాల పరంగా ప్రతికూల స్థితి) అని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ పేర్కొంది. ఈ ఏడాది రూపాయి ఇంత వరకు డాలర్‌తో 13 శాతం క్షీణించింది.

‘‘అయితే, చాలా వరకు అధిక రేటింగ్‌ కలిగిన భారత కార్పొరేట్‌ కంపెనీలు రూపాయి మరో 10 శాతం (ఈ నెల 6 నాటి రూ.72.11 ఆధారంగా) పడిపోయే అంచనాల ఆధారంగా హెడ్జింగ్‌ వంటి రక్షణాత్మక చర్యలను తీసుకున్నాయి’’ అని మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నాలిసా డిచియారా తెలిపారు. మూడిస్‌ నుంచి అధిక ఈల్డ్, ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఉన్న 24 భారత కంపెనీలు అమెరికా డాలర్ల రూపంలో కాంట్రాక్టులను కలిగి ఉండటంతో రూపాయి పతన ప్రభావం నుంచి సహజంగానే రక్షణ ఉంటుందని మూడీస్‌ తెలిపింది.


వర్ధమాన కరెన్సీలకు మారకం రిస్క్‌: నోమురా
వర్థమాన దేశాలకు కరెన్సీ రిస్క్‌ ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, ఈజిప్ట్, టర్కీ, ఉక్రెయిన్‌ కరెన్సీలకు మారకం సంక్షోభం ఉందని, వీటి స్కోరు 100కు పైగా ఉన్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో విధానాలు సాధారణంగా మారడం, వాణిజ్య రక్షణాత్మక ధోరణులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను తిరిగి మదింపు వేసుకుంటున్నారని నోమురా వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌ ‘డామోక్లెస్‌’ తెలిపింది.

100కు పైగా స్కోరు ఉంటే రానున్న 12 నెలల్లో ఆయా దేశాల కరెన్సీలకు మారకం సంక్షోభం పొంచి ఉందని అర్థం. 150కు పైగా స్కోరు ఉంటే ఏ సమయంలోనైనా మారకం సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సంకేతం. ఈ సూచీ ప్రకారం శ్రీలంక స్కోరు 175 కాగా, దక్షిణాఫ్రికా 143, అర్జెంటీనా 140, పాకిస్తాన్‌ 136, ఈజిప్ట్‌ 111, టర్కీ 104, ఉక్రెయిన్‌ 100 స్కోరుతో ఉన్నాయి.  

భారత్‌ స్కోరు 25..: భారత్‌కు సంబంధించి డామోక్లెస్‌ స్కోరు 25గా ఉండటం గమనార్హం. ‘‘భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 2018లో మోస్తరు స్థాయిలో (2012లో 9.7 శాతం నుంచి 2018లో 4.5 శాతానికి) ఉంటుంది. కరెంటు ఖాతా లోటు జీడీపీలో గతంలో 5 శాతంగా ఉండగా 2018లో 2.5 శాతంగా ఉంటుంది. ఆర్‌బీఐ వద్ద సమృద్ధిగా విదేశీ మారకం నిల్వలు ఉన్నాయి. దీంతో డామోక్లెస్‌ స్కోరు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికి 25 శాతానికి తగ్గింది’’ అని నోమురా వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement