లక్ష కోట్ల పెట్టుబడులు కావాలి
సీమాంధ్రలోఇలా చేస్తే...
వికేంద్రీకరణ: అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, విద్యా సంస్థలు, అలాగే వాణిజ్య కార్యకలాపాలను ఒకేచోట కాకుండా వేర్వేరుగా వివిధ నగరాల ఎంపిక.
విద్యుత్: సీమాంధ్రలో విద్యుత్ సర్‌ప్లస్ ఉంటుంది. ప్లాంట్లను పూర్తిగా వినియోగించుకునేందుకు ఇప్పటికే ఉన్న, కొత్తగా నెలకొల్పుతున్న ప్లాంట్లకు బొగ్గు, గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధి దృష్ట్యా నిరంతర విద్యుత్‌కు చర్యలు. సంప్రదాయేతర ఇంధన విధానం పటిష్టపర్చడం. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కొత్తగా లెసైన్సులు ఇవ్వకపోవడం. స్టాండలోన్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం.
రవాణా: మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు. మరిన్ని దేశీయ విమానాశ్రయాలు. బందరు పోర్టు అభివృద్ధి వేగిరం. కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు అంతర్జాతీయ స్థాయికి చేర్చడం. పారిశ్రామిక వాడలను పోర్టులతో అనుసంధానించేందుకు రైల్వే లైన్లు. నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లు.
పారిశ్రామిక కారిడార్లు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఔషధ, బల్క్ డ్రగ్, ఐటీ, ఐటీఈఎస్, నావికా రంగ ఆధారిత పరిశ్రమలు. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఎరువులు, రసాయనాలు, పురుగు మందుల తయారీ పరిశ్రము. గుంటూరు, కృష్ణాలో వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, పరిశోధన, అభివృద్ధి, ఆర్థిక సంస్థలు. చిత్తూరు, అనంతపూర్, నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ జోన్లతోపాటు ఈ జిల్లాలను చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌కు అనుసంధానం చేయడం.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభజన తర్వాత ఏర్పడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఒక్కో రాష్ట్రంలో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇందులో 30-40 శాతం తయారీ రంగంలో వచ్చినట్టయితే.. ఈ రంగంలో జాతీయ సగటు వృద్ధి రేటు 23-24 శాతానికి చేరుకుంటాం. ఇదే జరిగితే నాలుగేళ్లలో ఈ ఒక్క రంగంలో ఇరు రాష్ట్రాల్లో కలిపి 20 లక్షల మందికి ఉపాధి లభించడం ఖాయమని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణ నివేదికను ఫ్యాప్సీ బుధవారమిక్కడ విడుదల చేసింది.
నివేదికను రూపొందించిన ఫ్యాప్సీ ఇండస్ట్రియల్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మూర్తి, అసిస్టెంట్ డెరైక్టర్ టి.సుజాతతోపాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి ఈ సందర్భంగా కీలక అంశాలను మీడియాకు వివరించారు. మంచి నాయకత్వం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, నిరంతర విద్యుత్, రుణ సౌకర్యం, దీర్ఘకాలిక వ్యూహం ఆధారంగానే రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ఫ్యాప్సీ వెన్నంటి ఉంటుందన్నారు. త్వరలో వివిధ పార్టీలకు ఈ నివేదికను అందజేయనున్నట్టు చెప్పారు.
రంగాలు, అంశాల వారీగా ఫ్యాప్సీ సూచనలు ఇవే..
ఇరు రాష్ట్రాల్లో చేపట్టాల్సినవి..
పారిశ్రామిక అభివృద్ధి: రంగాల వారీగా పారిశ్రామిక విధానాల అమలు. అందుకుతగ్గ ప్రయోజనాలు, సౌకర్యాలు. అన్ని జిల్లాల్లో చిన్న పారిశ్రామిక వాడలు నెలకొల్పి లక్ష్యాలు నిర్ధేశించాలి.
మౌలిక వసతులు: మౌలిక వసతులుంటే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. వసతుల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్ద పీట. కాలుష్యకారక పరిశ్రమల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడలు. వీటికి రోడ్డు, రైలు సౌకర్యం.
ఆర్థిక సహాయం: సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలకు ప్రతి పారిశ్రామిక వాడలో సహకార రుణ సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం.
మార్కెటింగ్: మార్కెట్ తీరుతెన్నులు, అవకాశాల గురించి తాజా సమాచారం. సూక్ష్మ, చిన్న తరహా కంపెనీల కోసం కొనుగోలు-విక్రయదారుల సమావేశాలు, వస్తూత్పత్తుల ప్రదర్శన ల నిర్వహణ.
వ్యవసాయం: వ్యవసాయంలో యాంత్రికీకరణ కారణంగా ఉత్పాదకతతోపాటు పారిశ్రామికీకరణ సాధ్యపడుతుంది. విరివిగా కోల్డ్ స్టోరేజీలు. వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రత్యేక ప్రయోజనాలు.
మానవ వనరులు: విద్యార్థుల్లో పరిశ్రమకు అవసరమయ్యేవారి సంఖ్య 8-10 శాతానికి మించడం లేదు. అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ఇంటెగ్రేటెడ్ స్టేట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ప్లాన్ అమలు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వృత్తి నైపుణ్య శిక్షణ.
రియల్ ఎస్టేట్: భూముల ధరల నియంత్రణకు రియల్టీ కార్యకలాపాల కట్టడి. జిల్లాకో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుద్వారా భూముల సద్వినియోగం.
తెలంగాణలో ఇలా..
వికేంద్రీకరణ: హైదరాబాద్‌కున్న ఇమేజ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ కంపెనీలు మరిన్ని వస్తాయి. ఇక నుంచి పరిశ్రమలు, విద్యా సంస్థలు మిగిలిన జిల్లాల్లో రావాలి. ప్రణాళిక ప్రకారం ద్వితీయ శ్రేణి నగరాల్లో పట్టణీకరణ.
విద్యుత్: సీమాంధ్రలో విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా ఉండడంతో తెలంగాణలో 3,000 మెగావాట ్ల విద్యుత్ కొరత తలెత్తనుంది. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లో కొత్తగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లు. సౌర, పవన, బయోమాస్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం.
రవాణా: వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ. నిజామాబాద్, ఖమ్మంలో విమానాశ్రయాలు. పారిశ్రామిక ప్రాంతాలతో ప్రధాన నగరాలకు రైల్వే కనెక్టివిటీ. నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లు.
పారిశ్రామిక కారిడార్లు: ఆదిలాబాద్, కరీంనగర్‌లో విద్యుదుత్పత్తి, వస్త్ర పరిశ్రమ. నిజామాబాద్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధార పరిశ్రమలు, ఆరోగ్య రంగ సేవలు. మెదక్‌లో వాణిజ్య, ఇంజనీరింగ్, వాహన పరిశ్రమకు అవసరమయ్యే పరికరాల తయారీ. ఖమ్మం, వరంగల్‌లో ఖనిజాధార పరిశ్రమలు, ఐటీ-ఐటీఈఎస్. మహబూబ్‌నగర్, నల్గొండలో సిమెంటు, ఇంజనీరింగ్, వ్యవసాయాధార కార్యకలాపాలు, స్పిన్నింగ్, వస్త్రాల తయారీకి పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు.