
నల్ల ధనంపై కేంద్రానికి ఫిక్కీ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: నల్లధనం సమస్యకు చెక్ పెట్టేందుకు పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ గురువారం కేంద్రానికి పలు సిఫార్సులు చేసింది. బ్యాంకుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించడం, వ్యవసాయ ఆదాయంపై పన్నుల కోసం సముచిత విధానాలను రూపొందించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. అలాగే, రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని, పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఐటీపరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని రెవెన్యూ కార్యదర్శికి సమర్పించిన పత్రంలో ఫిక్కీ పేర్కొంది.
ఆభరణాలు మొదలైన అధిక విలువ కొనుగోళ్లకు సంబంధించి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మొదలైన వాటి రూపంలో చెల్లింపులు అందుకునే డీలర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని వివరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని.. రిజిస్ట్రేషన్ సమయంలో విధించే పన్నులు, చార్జీలను రెండు భాగాల కింద విడగొట్టాలని ఫిక్కీ అభిప్రాయపడింది.