పాల ప్యాకెట్లో ధరల పోరు!
రూ. 36కే లీటరంటూ హైదరాబాద్‌లోకి ‘నందిని’
⇒ ఇది... కర్ణాటక పాల రైతుల సమాఖ్య సొంత బ్రాండ్
⇒ రెండేళ్లలో రూ.2,000 కోట్లతో విస్తరించడానికి సన్నాహాలు
⇒ ఇటీవలే అమూల్ దెబ్బకు ధరలు తగ్గించిన ప్రైవేటు డెయిరీలు
⇒ తాజా పరిణామంతో మరింత తగ్గడానికీ చాన్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరల యుద్ధం పదునెక్కుతోంది.
గుజరాత్ సహకార దిగ్గజం అమూల్ ప్రవేశంతో ప్రైవేటు డెయిరీలు ధరలు తగ్గించి రెండుమూడు నెలలు కూడా గడవకముందే కర్ణాటక సహకార దిగ్గజం ‘నందిని’ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. లీటరు పాలు రూ.36కే విక్రయిస్తున్నట్లు ప్రకటించి... ధరల యుద్ధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. హైదరాబాద్ తమకు ఆరంభమేనని, తెలుగు రాష్ట్రాలు రెండింటా పూర్తి స్థాయిలో విస్తరిస్తామని చెప్పిన కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) ఎండీ ఎస్.ఎన్.జయరామన్... గురువారమిక్కడ కంపెనీ ఉత్పత్తుల్ని ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఎంఎఫ్ చైర్మన్ పి.నాగరాజుతో కలసి మీడియాతో మాట్లాడారు.
లక్ష లీటర్లు లక్ష్యంగా...: ప్రస్తుతం తాము హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లో రోజుకు 35 వేల లీటర్ల తాజా పాలు సరఫరా చేయగలుగుతామని జయరామ్ చెప్పారు. ‘కొద్ది రోజుల్లో దీన్ని లక్ష లీటర్లకు పెంచుతాం. కర్నాటకలోని బెల్గాం, బీజాపూర్ నుంచి పాలు సేకరించి హైదరాబాద్ సమీపంలోని థర్డ్ పార్టీకి చెందిన ప్రాసెసింగ్ కేంద్రానికి తరలిస్తున్నాం. డిమాండ్ పెరిగితే స్థానికంగా పాల సేకరణ చేపట్టడంతో పాటు సొంత ప్రాసెసింగ్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలకు విస్తరిస్తాం’ అని తెలిపారు.
సేకరణ వ్యవస్థ వైఫల్యంతోనే...: వ్యవస్థీకృత విధానంలో పాల సేకరణ జరుగుతున్నది కేవలం గుజరాత్, కర్ణాటకలోనేనని కేఎంఎఫ్ ఎండీ చెప్పారు. పాడి రైతుకు దేశంలో ఎక్కడా లేనంతగా తమ సంస్థ లీటరుకు రూ.27 చెల్లిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లీటరుకు రూ.19 చెల్లిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. దళారీ వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారని, కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని వివరించారు.
క్లిక్ చేస్తే ఇంటికే పాలు..
ఈ-కామర్స్ కంపెనీ బిగ్ బాస్కెట్ ఇప్పటికే నందిని ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ‘‘మేం ఈ వారంలో మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ నుంచి కస్టమర్లు తాజా పాలను కూడా ఆర్డరు చేయొచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు వాసులకు మాత్రమే ఈ సౌకర్యం. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరిస్తాం. కేఎంఎఫ్ 20% వృద్ధితో 2015-16లో రూ.12,720 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తోంది. పాల సేకరణ సామర్థ్యం జూన్ నాటికి రోజుకు 64 లక్షల నుంచి 70 లక్షల లీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నాం’’ అని జయరామ్ తెలియజేశారు. మౌలిక వసతుల కోసం వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు.
అమూల్ రాకతో...
రెండుమూడు నెలల కిందట అమూల్ ప్రవేశించేంత వరకూ రాష్ట్రంలో ఒక్క ‘విజయ’ బ్రాండ్ తప్ప మిగిలిన పాల ధరలు ఎక్కువగానే ఉండేవి. విజయ కూడా సహకార సమాఖ్యే కనక దాన్ని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదని, అందుకే తాము కూడా విజయ మాదిరే రూ.38 ధరనే నిర్ణయించామని అప్పట్లో అమూల్ ఎండీ ఆర్.ఎస్.సోధి చెప్పారు కూడా. అయితే అమూల్ రాకతో హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీ పాలను అధిక ధర పెట్టి కొంటున్న వారు అటువైపు మళ్లారు.
ఇంతలో నల్గొండ జిల్లా సహకార సమాఖ్య నార్ముక్ కూడా నార్ముక్ బ్రాండ్‌తో లీటరు రూ.38కే ఇస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. చివరికి విధి లేక హెరిటేజ్ కూడా తన పాల ధరను రూ.40కి తగ్గించింది. తాజాగా ‘నందిని’ రాకతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారిం ది. నందిని ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.50, డబుల్ టోన్డ్ పాలు 300 మిల్లీలీటర్లు రూ.10, పెరుగు 200 గ్రాముల ప్యాక్ రూ.10 చొప్పున విక్రయిస్తోంది.