
సంస్కరణలను పట్టించుకోకపోవడం సరికాదు
మూడీస్ రేటింగ్ విధానాన్ని తప్పుబట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: రేటింగ్ విషయంలో మూడీస్ అనుసరిస్తున్న పరిశోధనా పద్దతి తగిన విధంగా లేదని కేంద్ర ఆర్థికశాఖ గురువారం పేర్కొంది. కేంద్రం ప్రారంభించిన సంస్కరణలను మూడీస్ పట్టించుకోవడం లేదని, వాటి ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుందన్న ఆ సంస్థ అభిప్రాయం తగదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి స్వేచ్ఛగా ఒక అంచనాకు రేటింగ్ ఏజెన్సీలు రావచ్చని ఆయన అంటూనే... అయితే మూడీస్ రేటింగ్ పరిశోధనా విధానం సరికాదన్నదే తమ అభిప్రాయమని వివరించారు.
దేశంలో సంస్కరణల అమలు తీరును సందేహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని పేర్కొన్నారు. గత పలు సంవత్సరాలుగా ప్రత్యేకించి రెండేళ్లుగా సంస్కరణలు ఎటువంటి అడ్డంకులూ లేకుండా కొనసాగుతున్నాయని వివరించారు. ‘అలాంటి పరిస్థితుల్లో వీటికి వెయిటేజ్ ఇప్పుడు ఏమీ ఇవ్వబోమని మీరు (మూడీస్) చెప్పడం సరికాదు’ అని ఆయన అన్నారు.