మళ్లీ అదే రేటింగ్‌.. | Fitch retains India's credit rating at BBB | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే రేటింగ్‌..

Published Fri, Apr 5 2019 5:27 AM | Last Updated on Fri, Apr 5 2019 5:27 AM

Fitch retains India's credit rating at BBB - Sakshi

న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల ముంగిట అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తాజాగా భారత్‌కు మరోసారి ట్రిపుల్‌ బి మైనస్‌ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో వరుసగా 13వ ఏడాది ఇదే రేటింగ్‌ కొనసాగించినట్లయింది. పెట్టుబడులకు సంబంధించి తక్కువ స్థాయి గ్రేడ్‌ను ఇది సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉండటమే భారత రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఫిచ్‌ పేర్కొంది. 2006 నుంచి భారత సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్‌ ఇదే స్థాయిలో కొనసాగిస్తోంది.

‘ప్రభుత్వ రుణభారం పేరుకుపోవడంతో పాటు ఆర్థిక రంగం పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ.. మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు విదేశీ పరిణామాలను దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా కనిపిస్తుండటం ఈ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి‘ అని ఫిచ్‌ వివరించింది. మధ్యకాలికంగా ప్రభుత్వం అనుసరించబోయే ద్రవ్య విధానాలు.. రేటింగ్‌ అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది.

విధానపరమైన ఎజెండాపరంగా చూస్తే సార్వత్రిక ఎన్నికల కారణంగా తాత్కాలికంగా కొంత అనిశ్చితి నెలకొన్నా.. గడిచిన 30 ఏళ్లుగా చరిత్ర చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ సంస్కరణలపైనే దృష్టి పెడుతుండటం చూడవచ్చని వివరించింది. ‘ఎన్నికల సరళి చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి తక్కువ మెజారిటీనే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అది జీఎస్‌టీ వంటి పెద్ద సంస్కరణలకు మద్దతు కూడగట్టుకోవడం కష్టసాధ్యంగా ఉండొచ్చు. అయినప్పటికీ సంస్కరణలపై దృష్టి పెట్ట డం మాత్రం కొనసాగుతుంది‘ అని ఫిచ్‌ తెలిపింది.  

ఈసారి 6.8 శాతం వృద్ధి..
భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగాను ఉండొచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. ఉదార ద్రవ్యపరపతి విధానాలు, బ్యాంకింగ్‌ నిబంధనలను సరళతరం చేయడం, ప్రభుత్వ వ్యయాలు పెంచడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. 2018–19 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా నమోదైందని తెలిపింది. సాధారణంగా 3.6 శాతంగా ఉండే ట్రిపుల్‌ బి రేటింగ్‌ ఉండే దేశాల సగటుతో పోలిస్తే ఇది రెట్టింపని ఫిచ్‌ తెలిపింది.

ప్రస్తుత ప్రభుత్వం వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ), దివాలా స్మృతి వంటి కొన్ని కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని, మరికొన్ని సంస్కరణలు కూడా ప్రవేశపెట్టినప్పటికీ.. వాటి ప్రభావాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని వివరించింది. ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించడం, పాలనాపరంగా కఠిన నిబంధనలు సరళతరం చేయడం వల్ల లావాదేవీల వ్యయాలు తగ్గాయి. అయితే వ్యాపారాల నిర్వహణకు సంబంధించి ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక కూడా ఆకర్షణీయ స్థాయిలో ఉండటం లేదు‘ అని ఫిచ్‌ తెలిపింది.

ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోనున్న ప్రభుత్వం: గార్గ్‌
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి విధించుకున్న ద్రవ్యలోటు లక్ష్యం 3.4 శాతానికి చేరువలోనే ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్రగార్గ్‌ తెలిపారు. వాస్తవానికి తొలుత 3.3 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలనుకున్న కేంద్ర సర్కారు, ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన పలు రాయితీలు, పథకాలతో లోటును 3.4 శాతానికి సవరించుకుంది. ఈ లక్ష్యానికి చాలా సమీపంలోనే ఉన్నామని గార్గ్‌ స్పష్టం చేశారు. కొన్ని గణాంకాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. 2018–19లో పరోక్ష పన్నుల వసూళ్లలో లోటు ఉంటుందంటూ ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తున్న విషయం గమనార్హం. ప్రత్యక్ష పన్నుల (వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను) ద్వారా తొలుత రూ.11.5 లక్షల ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకోగా, దానిని సైతం రూ.12 లక్షల కోట్లకు పెంచిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement