
పసిడికి పరుగెందుకు..?
ధరల్లో హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలివీ..
బంగారంతో మన బంధం మామూలుది కాదు. బంగారు తల్లి... బంగారు తండ్రి... పుత్తడి బొమ్మ... ఇలా బంగారంలాంటి ముద్దుపేర్లెన్నో!! ఎందుకంటే మన దేశంలో బంగారమంటే ఓ సామాజిక హోదా. పెళ్లిళ్లలో ఇది తెలుస్తూనే ఉంటుంది. అలాగే బంగారాన్ని మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా కూడా చూస్తారు. కొన్ని దశాబ్దాలుగా బంగారం ధర లు పెరుగుతూనే వస్తున్నాయి. 1925లో రూ.18గా ఉన్న 10 గ్రాముల బంగారం ఇపుడు రూ.27 వేలకు చేరింది. మిగతా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో పోలిస్తే బంగార ం ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఒకటికాదు. బంగారం ధరల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. దేశీయ డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ పరిణామాలు, కరెన్సీ విలువ, కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఉత్పత్తి తదితరాలన్నీ కలిసే పసిడి ధరను నిర్ణయిస్తాయి. వీటినొక్కసారి చూస్తే...
డిమాండ్ పెరుగుతోంది...
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న బంగారంలో 50 శాతం ఆభరణాల తయారీకి పోతోంది. ఇక 40 శాతం పెట్టుబడులకు, 10 శాతం పరిశ్రమల అవసరాలకు వాడుతున్నారు. ఇక ప్రపంచంలో ఉత్పత్తవుతున్న బంగారాన్ని అధికంగా వినియోగిస్తున్నది మనమే. మనవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న బంగారంలో 25 శాతాన్ని కేవలం ఆభరణాల కోసమే వినియోగిస్తారు. మరోవంక బంగారం సరఫరా మాత్రం డిమాండ్‌కు తగ్గట్టుగా లేదు.
డాలర్‌తో రూపాయి మారక విలువ...
ఈ మధ్య కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా తగ్గింది. నిజానికి బలపడినా, క్షీణించినా బంగారం విలువ ప్రభావితమవుతుంది. ఎందుకంటే బంగారం ఉత్పత్తి విదేశాల్లోనే ఎక్కువ. డిమాండ్‌కు అనుగుణంగా మనం దాన్ని దిగుమతి చేసుకోవాలి. దీనికి చెల్లింపులు డాలర్లలో చేయాలి కనక... రూపాయి మారక విలువలో ఒడిదుడుకులు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు డాలర్‌తో రూపాయి విలువ తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. అదే పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. ఒకప్పుడు డాలర్‌తో రూ.45 వద్ద స్థిరంగా ఉన్న రూపాయి విలువ ప్రస్తుతం రూ.64 వద్ద కదులుతోంది. ఈ మేరకు బంగారం పెరిగినట్టే!.
తక్కువ ఉత్పత్తి- అధిక పెట్టుబడి
ప్రస్తుతం బంగారం ఉత్పత్తి చేసే దేశాల సంఖ్య తగ్గిపోతోంది. దీని ఉత్పత్తిలో దక్షిణాఫ్రికా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, ఫిలిప్పిన్స్ తదితర దేశాల వాటా ఎక్కువ. మన దేశంలో కర్ణాటక, ఏపీ, జార్ఖండ్, కేరళలో బంగారం ఉత్పత్తవుతోంది. నిజానికి పసిడి ఉత్పత్తి ఖర్చుతో కూడిన పని. అందుకే ప్రపంచ వ్యాప్తంగా బంగారు గనుల అన్వేషణ తగ్గింది. కొత్త గనులను కనుగొనడం లేదు. ఇదంతా ఎందుకంటే పసిడి అన్వేషణ ఖర్చుతో పోలిస్తే వస్తున్న ఆదాయం అంతంత మాత్రం.
పెరుగుతున్న దిగుమతి నిల్వలు
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. భారత్, చైనాలో ఈ మధ్య పుత్తడి దిగుమతులు బాగా పెరిగాయి. భారత్‌లో నిల్వలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 557.74 టన్నులు. ఆర్‌బీఐ వద్ద 19 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వలు ఉన్నాయి.
ఆర్థిక మాంద్య పరిస్థితులు
బంగారం ధరలను ఆర్థిక మాంద్యమూ ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాంద్యంలో ఉన్న దేశాలు రుణాలు తీర్చలేవు. పారిశ్రామిక ఉత్పత్తి కూడా తక్కువగా నమోదవుతుంది. జీడీపీ వృద్ధి ఆశించినంత ఉండదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. చివరకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి. ఇలాంటపుడు ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం కనక బంగారంలో అధికంగా ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయి. దేశంలో బంగారం దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటు పెరిగితే కేంద్రం పసిడి దిగుమతి సుంకాలను పెంచుతుంది. దీంతో ధర పెరుగుతుంది.