నల్లధనం కట్టడికి మరిన్ని చర్యలు
న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని కట్టడి చేసేందుకు త్వరలో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెలికితీసేందుకే కొత్తగా నల్లధనం నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, నిజాయితీగా పన్నులు చెల్లించేవాళ్లు ఈ చట్టాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య, వసూళ్లు పెరిగితే... పన్ను రేట్లలో రాయితీలు కూడా ఇచ్చేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. కేంద్రీయ ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ) సదస్సులో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్లకు పన్ను చెల్లింపులకు సరైన విధానాన్ని రూపొందించాల్సిందిగా సీబీడీటీకి జైట్లీ సూచించారు.
దేశీయంగా ఉన్న నల్లధనానికి చెక్ చెప్పడం కోసం బినామీ లావాదేవీల నిరోదన బిల్లును కూడా ప్రవేశపెట్టామని చెప్పారు. భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక పన్నుల విషయంలో అత్యంత కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు దిశగా కొంత పురోగతి సాధించామని.. అంతర్జాతీయంగా అమోదయోగ్యమైన, స్థిరమైన పన్నుల వ్యవస్థ దిశగా తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. గ్లోబల్ స్థాయికి పన్ను రేట్లను తగ్గించడం, ఇదే సమయంలో మినహాయింపులన్నింటినీ తొలగించాల్సి ఉందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ దిశలో కార్పొరేట్ పన్నులు వచ్చే నాలుగేళ్లలో 30% నుంచి 25%కి తగ్గించేలా చర్యలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. జీఎస్‌టీ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించామని.. వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు.
వసూళ్లు పెరిగితేనే...
సామాజిక, మౌలిక రంగ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం పెరగాలంటే పన్ను వసూళ్లు మెరుగుపడాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు. ఇందుకోసం పన్నుల పరిధి(చెల్లింపుదార్ల సంఖ్య) కూడా విస్తరించాల్సిందేనని అధికారులకు ఉద్భోదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 14-15% వృద్ధి చెందొచ్చని జైట్లీ అంచనా వేశారు. దీనివల్ల 3.9% ద్రవ్యలోటు లక్ష్యాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ద్రవ్యలోటు కట్టడి కంటే సామాజిక పథకాలపై వ్యయాన్ని పెంచడానికే తమ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ‘ప్రభుత్వ వ్యయం పెరిగితే ఆర్థిక వ్యవస్థకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇన్‌ఫ్రా, సాగునీరు ఇతరత్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెరుగుతాయి. వృద్ధి రేటు కూడా మరింత పుంజుకుంటుంది’ అని జట్లీ వివరించారు.